అసలే ఓడిపోయిన తర్వాత చేయడానికి పనేం లేకుండాపోయింది! అధికారంలో ఉన్నప్పుడు పబ్జీ ఆడుకుంటూ గడిపేస్తుండేవారు గానీ.. ఓడిపోయిన పరాభవ భారంలో అందుకు కూడా మనస్కరించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఏదో ఒక పని సృష్టించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. కాసేపు పాదయాత్ర అంటున్నారు, కాసేపు ఇంకో యాత్ర అంటున్నారు.
వీలైనంత మేర ఈవీఎంలలో మోసాలు జరగడం వల్లనే తమ పార్టీ ఓడిపోయినట్లుగా ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలందరూ నవ్వుతున్నారని, పరువు పోతున్నదని అర్థమై దానిని కాస్త తగ్గించారు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఆయనకు ఓడిపోయిన ఎమ్మెల్యేలతో ఓ మీటింగు పెట్టుకోడానికి ఖాళీ దొరికింది. మీటింగు పెట్టి అందరినీ ఊరడిస్తారట. ధైర్యం చెబుతారట. స్ఫూర్తి అందిస్తారట.
జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఎమ్మెల్సీలతో ఎంపీలతో మీటింగులు పెట్టుకుని .. పార్టీ ఎలా పోరాడాలో వారికి దిశానిర్దేశం చేశారు. అంతే తప్ప పార్టీ తరఫున రాష్ట్రంలోర 175 నియోజకవర్గాల్లో పోటీచేసిన వారితో మాట్లాడడానికి ఆయనకు ఇంకా మూడ్ కుదరలేదు. ఏదో కొందరు గెలిచిన, కొందరు ఓడిపోయిన వాళ్లు తాడేపల్లి ప్యాలెస్ కు వస్తే.. వారినందరినీ తన గదిలోకి పిలిపించుకుని.. కొందరు తప్ప అందరినీ నిల్చోబెట్టి మాట్లాడి పంపించేశారు. ఓడిపోయినా సరే.. ఆయనలో అహంకారం తగ్గలేదని పార్టీ వాళ్లే వ్యాఖ్యానించడం జరిగింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు పార్టీ అభ్యర్థులందరితోనూ సమావేశం అవ్వాలని అనుకుంటున్నారట. భవిష్యత్ కార్యచరణను ఈ మీటింగులో నిర్ణయిస్తారట. కీలక సూచనలతో దిశానిర్దేశం చేస్తారట. త్వరలోనే పార్టీ పుంజుకుంటుందని జగన్ వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే వివిధ ప్రాంతాల్లోని పార్టీ నాయకులనుంచి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ భేటీకి పలువురు అభ్యర్థులు డుమ్మా కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. జగన్ షెడ్యూలు ప్రకారం.. 175 మంది ఎమ్మెల్యే, 25 మంది ఎంపీ అభ్యర్థులతో ఆయన భేటీ కావాలి. రెండు కేటగిరీలు కలిపి గెలిచిన వాళ్లు 15 మందే. అయితే ఈ సమావేశానికి చాలా మంది అభ్యర్థులు హాజరయ్యే ఉద్దేశంతో లేనేలేరట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధానికి ఈ పరాజయంతోనే ఫుల్ స్టాప్ పట్టాలని అనుకుంటున్నారట. అందరినీ దువ్వి, పార్టీ వీడిపోకుండా చూడడానికే జగన్ ఈ భేటీ ద్వారా తాపత్రయపడుతున్నారు గానీ.. ఇప్పటికే పార్టీని వదలడానికి నిర్ణయించుకున్న వారు గైర్హజారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.