కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతీ అని పెద్దలు చెబుతారు. ఆడవాళ్లను దుఃఖానికి గురిచేసిన సమాజం బాగుపడదు అని దీని అర్థం. ఈ పద్యం యొక్క అర్థం మరియు భావం ఏమిటో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ కలిసి వివరించి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. తన సొంత చెల్లెలికి ఆస్తుల విషయంలో అన్యాయం చేయాలని అనుకున్న, అందుకోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి.. చెల్లెలి కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నారు. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ లోనే భోరుమని విలపిస్తూ.. అందరూ కలసి తనకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కుటుంబ ఆస్తులలో షర్మిలకు రావాల్సిన వాటాల గురించి జగన్మోహన్ రెడ్డి ఒక ఒప్పందపత్రం ఎంఓయూ రాసి ఇచ్చారు. 2019 ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత.. ఆ ఎన్నికల్లో ప్రచారానికి చెల్లెలిని కూడా బాగా వాడుకున్న తరువాత.. ఆమె ద్వారా మరియు అమ్మ ద్వారా సాగించిన ఎన్నికల ప్రచారం కూడా ఉపయోగపడి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్ ఇక వారి అవసరం లేదని అనుకున్నారు. తాను వేస్తున్న బిస్కట్ పథకాల ప్రభావంతో.. మరో ముప్ఫయ్యేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా అలరారుతూ ఉంటానని ఆశపడ్డారు. అందుకే చెల్లెలిని వదిలించుకోదలచి.. ఆమెకు ఆస్తులలో వాటాలు పెడుతూ ఒక ఎంఓయూ సంతకం చేసి ఇచ్చారు.
ఈడీ ఎటాచ్ మెంట్ లో ఉన్న ఆస్తులన్నింటిలో వాటాలు ఇస్తూ.. అన్నీ క్లియర్ అయిన తర్వాత అందులో వాటాలు ఇస్తాననేది దాని సారాంశం.ఈ ఎంఓయూమీద అన్నా చెల్లెళ్లు ఇద్దరూ సంతకాలు చేశారు. వారి బాబాయి వైవీ సుబ్బారెడ్డి సాక్షి సంతకం చేశారు. ఇప్పుడు వివాదం ట్రిబ్యునల్ దాకా వెళ్లిన తర్వాత.. పాపం షర్మిల సాక్షి సంతకం చేసిన పెద్దమనిషిగా బాబాయి న్యాయం చేస్తారని భావించారు. కాకపోతే ఆయన జగన్ కోటరీలోని చిలుకలాగా మాట్లాడుతూ.. చంద్రబాబు కుట్రలో భాగంగా మారి షర్మిల గొడవ చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్ లో ఆరోపించారు. దీనిపై షర్మిల భోరున విలపించడం గమనార్హం. జగన్ ఇచ్చిన పదవుల ద్వారా సంపాదించుకున్న బాబాయి.. ఆయనకు అనుకూలంగా మాట్లాడడం వింత కాదని ఆమె వాపోతున్నారు.
తాను చెప్పిందంతా నిజమేనని తాను బిడ్డల మీద ప్రమాణం చేస్తానని, వైవీ సుబ్బారెడ్డి కూడా అలా ప్రమాణం చేయగలరా అని షర్మిల సవాలు విసురుతున్నారు. అయితే వైవీ సుబ్బారెడ్డి ప్రమాణాలు అంటేనే తెగ భయం అనే సంగతి ఆమె గుర్తించారోలేదో! తిరుమల లడ్డూ నెయ్యి వివాదం అంతగా ముదిరినా సరే.. అప్పట్లో తానే ఛైర్మన్ అయినా వైవీ ప్రమాణం చేయలేదు. భూమన చేసినా కూడా తాను చేయలేదు. ప్రమాణం అంటే భయపడ్డారు. అలాంటిది.. చాలా స్పష్టంగా అబద్ధాలు చెబుతున్న ఈ కుటుంబ ఆస్తుల గొడవలో బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పడం సాధ్యమేనా? అని ప్రజలు అనుకుంటున్నారు.