ఇప్పుడు సొమ్ములు తెండి.. గెలిచాక పదవులిస్తాం..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు కొత్త వ్యాపార సూత్రం కనుగొన్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అవకాశాన్ని వ్యాపారంగా మార్చుకొని కోట్లు దండుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమరంలో పార్టీకి విజయావకాశాలు క్లిష్టంగా ఉన్న తరుణంలో తాము ఎంత కష్టపడి ప్రచారం నిర్వహించినా ఖర్చు చేసినా ఫలితం ఎలా ఉంటుందో వారికి బోధపడటం లేదు. ఈ నేపథ్యంలో గెలుపు మీద అతి నమ్మకంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం అనవసరం అనే భావనతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా తమ సొంత ఖజానా నుంచి పరిమితంగా డబ్బులు బయటకు తీస్తూ, నియోజకవర్గాలలోని తమ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను కూడా విరాళంగా పెద్ద మొత్తాలు సమకూర్చాలని అడుగుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ద్వితీయ శ్రేణి నాయకులను డబ్బు అడుగుతున్న అధికార పార్టీ అభ్యర్థులు ఈసారి గెలిచిన తర్వాత మీకు ఫలానా నామినేటెడ్ పోస్ట్ వేయిస్తాం, కార్పొరేషన్ పదవులు ఇప్పిస్తాం.. అని కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక చిన్న స్థాయి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యత్వ పదవికి 30 నుంచి 40 లక్షల రూపాయల ధర నిర్ణయించి ఆ మేరకు సొమ్ములు ఇప్పుడే ఏర్పాటు చేయమని, గెలిచి తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పదవి ఇస్తామని అంటున్నట్లుగా సమాచారం. ఎందుకూ పనికిరాని చిన్న స్థాయి ఆలయ ట్రస్ట్ పదవికే ఈ స్థాయి రేట్లు నిర్ణయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ఎలాంటి కార్పోరేషన్ పదవులకు ఎలాంటి భారీ ధరలు పెట్టి ఉంటారో అనే చర్చ ప్రజలలో నడుస్తోంది.

సాధారణంగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలు దక్కిన నాయకులు తమ మిత్రులు, సన్నిహితులు, తమ ద్వారా రకరకాల ప్రయోజనాలు ఆశించే ఇతర వ్యక్తుల నుంచి భారీగా విరాళాలు రాబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తాము గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ ఇప్పిస్తాం, పదవులు ఇప్పిస్తాం అనే వాగ్దానాలతో వారి నుంచి పెద్ద మొత్తాలు కోట్ల వరకు కూడా సొమ్ములు రాబడుతూ ఉంటారు. ఎమ్మెల్యే గెలవడం మాత్రమే కాదు, పార్టీ కూడా గెలిచి అధికారంలోకి వచ్చినా సరే తాము పెట్టిన పెట్టుబడులకు వడ్డీ గిట్టుబాటు అయ్యేలా కాంట్రాక్టులు పనులు దక్కుతాయనే నమ్మకం ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉండడం లేదు. ఎందుకంటే కాంట్రాక్టులు పొందే సమయంలో మళ్లీ అప్పటికి తగిన విధంగా ప్రభుత్వంలోని పెద్దలకు ముడుపులు సమర్పించుకుంటే తప్ప పనులు దక్కడం లేదు. బిల్లులు రావడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను నమ్ముకొని పెట్టేవారు తగ్గిపోతున్నారు. ప్రత్యేకించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్లలో దోచుకున్న మొత్తాలు ఖర్చు పెడితే చాలునని ద్వితీయ శ్రేణి నాయకులు తమ డబ్బు బయటకు తీయడానికి సుముఖంగా లేరు. పైగా పార్టీ అధికారంలోకి వస్తుందని గ్యారెంటీ లేకపోవడంతో ఎమ్మెల్యే అభ్యర్తులను నమ్మి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా వృధా అవుతుందనే భయం చాలామందిలో ఉంది. అలాగని బయటపడకుండా బింకంగా ప్రచారపర్వంలో మాత్రం చురుగ్గా పాల్గొంటూ అటు ఎమ్మెల్యే ఇటు పార్టీ కూడా గెలిచి అధికారంలోకి వస్తే తాము దండుకోవడానికి మార్గాలు మూసుకుపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఐదేళ్లలో ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి ప్రస్తుత ఎన్నికల కోసం విధులు వెనకేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిగులు లేదుగానీ.. అంతంత మాత్రం అవినీతితో దండుకునే అవకాశాలు తగినన్ని పొందలేకపోయిన అభ్యర్థులు నిధులు కోసం బాగా ఇబ్బంది పడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories