జగన్ పరిపాలన కాలంలో మద్యం తయారుచేసే డిస్టిలరీలను లొంగదీసుకున్నారు. బెదిరించారు, భయపెట్టారు.. తమతో కుమ్మక్కు అయ్యేలా మార్చుకున్నారు. వారిని గతిలేని పరిస్థితుల్లోకి నెట్టేసి వారినుంచి ముడుపులు స్వీకరించడం ప్రారంభించారు. కొత్త లిక్కర్ పాలసీ తీసుకువచ్చి.. మద్యం దుకాణాలు అన్నింటినీ ప్రభుత్వం ద్వారానే నిర్వహించేలా చేస్తూ.. తాము ఆర్డర్లు పెట్టాలంటే.. తమకు వాటాలు ముట్టజెప్పిన తర్వాతనే అంటూ అపరిమితమైన దందా నిర్వహించారు. -ఇదీ ఇప్పటిదాకా మద్యం కుంభకోణంగా మనం అందరం మాట్లాడుకుంటున్నది. ఈ రూపంలోనే మద్యం డిస్టిలరీలనుంచి దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని సిట్ పోలీసులు తేలుస్తున్నారు. ఆ సొమ్ములు ఎప్పుడెలా దారిమళ్లాయో వివరాలు రాబడుతున్నారు. ఇప్పటికే 41 మంది నిందితులుగా ఉన్నారు. పలువురి అరెస్టు తర్వాత.. అందరి అనుమానాలు బిగ్ బాస్ వైపు కూడా మళ్లుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల మరింత దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. మద్యం కుంభకోణం రూపంలో జరిగిన కేవలం మూడున్నర వేల దోపిడీ కాదని, మొత్తం లక్ష కోట్లకు పైగా జగన్ దోచుకున్నారని ఆమె అంటున్నారు. అందుకు సాధికారికమైన రీతిలో తన విశ్లేషణ కూడా చెబెుతున్నారు.
మద్యం కుంభకోణం అనేది ఇప్పటిదాకా డిస్టిలరీల చుట్టూ మాత్రమే తిరుగుతున్నదని షర్మిల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తయారీ దశలో మాత్రమే కాదు.. విక్రయాల విషయంలో కూడా భారీ అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నాయి అని ఆమె ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కేవలం నగదుతో మాత్రమే విక్రయాలు అని అంటూ.. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని భారీగా వేలకు వేల కోట్లు దోచేశారు. ఇది అతిపెద్ద ఆర్థిక నేరం. ఈ డిజిటల్యుగంలో మద్యం దుకాణాల్లో నగదు పద్ధతిని మాత్రమే అమలు చేశారు. ఈ విక్రయాల తీరు మీద కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి అని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే చేయడం ద్వారా.. ఎంత లిక్కర్ అమ్మిన ఖచ్చితమైన వివరాలు ఎక్కడా నమోదు కాకుండా.. జగన్ సర్కారు అప్పట్లో అతి తెలివి ప్రదర్శించింది. వేల కోట్లరూపాయల విలువైన మద్యాన్ని ఎలాంటి లెక్కల్లోనూ చూపకుండా విక్రయించి బ్లాక్ మనీగా సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. షర్మిల చెప్పినట్టుగానే.. సిట్ విచారణ ఇప్పటిదాకా డిస్టిలరీల చుట్టూ తిరుగుతూనే ఉంది తప్ప.. విక్రయాల్లో నగదు లావాదేవీల కారణంగా ఎంత మొత్తం కాజేశారనే లెక్కలు లేవు. ఆ వైపు దృష్టి సారించనేలేదు. షర్మిల డిమాండు మేరకు అటు కూడా దర్యాప్తు సాగితే గనుక.. ఆమె చెబుతున్నట్టు మొత్తం కాజేసిన సొమ్ము లక్ష కోట్లు కాకపోయినప్పటికీ.. మూడున్నర వేల కోట్ల కంటె చాలా పెద్ద భారీ మొత్తాల అవినీతి బయటపడవచ్చునని పలువురు భావిస్తున్నారు.
ఇప్పటికే 41మంది నిందితులు ఉన్న ఈ కేసులో విక్రయాల గురించి కూడా దర్యాప్తు జత అయితే గనుక.. వందల మంది నిందితులు కొత్తగా కేసులోకి వచ్చే అవకాశం ఉన్నదని కూడా అంటున్నారు. మరి జగన్ పాలనలో జరిగిన లిక్కర్ పాపాలు ఎప్పటికి పండుతాయో వేచిచూడాలి.