అమరావతి రాజధాని ప్రాంతం మీద నారా చంద్రబాబునాయుడు ముద్ర అనేదే ఉండరాదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. ప్రజలకు తనకు ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వగానే.. అమరావతి రాజధాని ప్రాంతంలో.. చంద్రబాబు ముద్రగా మిగిలిన నిర్మాణాలను ధ్వంసం చేసేయడం ఆయన తొలికర్తవ్యంగా భావించారు. అందుకే చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఉండే ప్రజావేదికను విధ్వంసంచేశారు. అమరావతిలో అయిదేళ్లలో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా సగంలో ఆగిన నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండాపోయేలా జగన్మోహన్ రెడ్డి పగబట్టారు. అయితే ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత.. ఆ శకలాలను కూడా అయిదేళ్లుగా తొలగించకపోవడం.. వాటిని అలాగే వదిలేయడం అనేది జగన్ లోని శాడిస్టు ధోరణికి పరాకాష్టగా కనిపిస్తున్నదని ఇవాళ ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
ఎందుకంటే.. చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండో పర్యటనగా అమరావతి ప్రాంతంలో తిరుగుతున్నారు. ఆయన తన నివాసానికి సమీపంలోనే ఉన్న, జగన్ కూల్చివేసిన ప్రజావేదిక దగ్గరినుంచే తన పర్యటన ప్రారంభించారు. ప్రజావేదిక శిథిలాలను, వాటి మధ్యలో విజనరీ నాయకుడు చంద్రబాబును టీవీ లైవ్ కార్యక్రమాల్లో చూస్తున్న రాష్ట్ర ప్రజలకు కడుపు తరుక్కుపోతోంది. రక్తం ఉడికిపోతోంది. కూల్చివేయడం మాత్రమే కాదు.. ఆ శిథిలాలను తొలగించకపోవడం ఖచ్చితంగా జగన్ శాడిస్టు ధోరణే అంటున్నారు. జగన్ కు ప్రజలు సరిగానే బుద్ధి చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజావేదిక అనేది ఉండవిల్లిలోని చంద్రబాబునాయుడు నివాసానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆయన నిత్యం ప్రజావేదిక మీదుగానే తన నివాసానికి వెళ్లాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. తన మొట్టమొదటి పనిగా.. ఆ ప్రజావేదికను కూల్చేసిన జగన్.. అయిదేళ్లుగా శిథిలాలను తొలగించలేదు కూడా. దానిని ప్రజలను కలవడం కోసం ఎంతో కలగని నిర్మించిన చంద్రబాబు.. ఆ శిథిలాలను చూస్తూనే ప్రతిరోజూ తన ఇంటికి వస్తూ వెళుతూ ఉండాలని.. ప్రతిరోజూ ఆ శిథిలాలను చూసుకుని చంద్రబాబు బాధపడుతూ ఉండాలని శాడిస్టిక్ గా జగన్ ఆలోచించారని ప్రజలు అంటున్నారు. ఆ శాడిజానికి చెంపపెట్టుగానే ప్రజల తీర్పు వచ్చిందని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రజావేదికను మరింత దృఢమైన కట్టడంగా పునర్నిర్మించే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర కట్టడాలను కూడా పరిశీలించిన తర్వాత.. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ కార్యచరణ ప్రణాళిక గురించి వెల్లడిస్తారు.