నాట్ ఓన్లీ షర్మిల.. టీడీపీ నేతల్నీ ట్యాపింగ్ చేసిన జగన్!

తెలంగాణలో కేసీఆర్ జమానాలో రాజకీయ ప్రత్యర్థుల రహస్యాలను తెలుసుకోవడానికి అనైతికంగా చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కొత్త కొత్త వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. హైదరాబాదు కేంద్రంగా కేసీఆర్ మార్గదర్శకత్వంలో.. తెలంగాణ పోలీసుల్లోని గులాబీ కోటరీ ఎంతో రహస్యంగా నడిపించిన ఫోన్ ట్యాపింగ్ పాపంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా సమానమైన వాటా ఉన్నదని తెలుస్తోంది. తమ రాజకీయ ప్రత్యర్థుల, శత్రువుల గుట్టుమట్టులు తెలుసుకోవడానికి ఈ ట్యాపింగ్ దందాను ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమానంగా వాడుకున్నారు. కేసీఆర్ తో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తన చెల్లెలు వైఎస్ షర్మిలకు  రాజకీయ భవిష్యత్తులేకుండా తొక్కేయడానికి ఈ ట్యాపింగ్ ద్వారా ఆమె కాల్స్ వివరాలు తెలుసుకుంటూ తెరవెనుక మంత్రాంగం నడిపారనేది ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే కేవలం షర్మిలకు మాత్రమే పరిమితం కాకుండా.. అప్పట్లో హైదరాబాదులో కూడా నివాసాలు కలిగిఉంటున్న అనేకమంది తెలుగుదేశం నాయకుల, తెలుగుదేశానికి చెందిన వ్యాపారవేత్తల రహస్యాలు తెలుసుకోవడానికి కూడా జగన్ ఈ ట్యాపింగ్ దందాను వాడుకున్నట్టుగా ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన పుత్రసమానుడిగా ప్రోత్సహిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఫుల్ రేంజి సహకారం అందించారని కూడా తెలుస్తోంది.

తనను రాజకీయంగా నాశనం చేయడానికి కేసీఆర్ ద్వారా జగన్ తన ఫోను ట్యాపింగ్ చేయించారని తాను బైబిలు సాక్షిగా ప్రమాణం చేసి చెప్పగలనని షర్మిల అన్నారు. ఈ అంశం జగన్ విలేకర్ల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన వెటకారంతో కూడిన డైలాగులు వేశారు. షర్మిల ఆ సమయంలో ఆ రాష్ట్రంలో రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న నేపథ్యంలో చేశారేమో నాకేం తెలుసు.. అంటూ పెడసరపు జవాబులు ఇచ్చారు. ట్యాపింగ్ ను సమర్థించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయనేది ఒక సంగతి.
కాగా, కేసీఆర్ సాగించిన ట్యాపింగ్ దందా ద్వారా.. హైదరాబాదులో కూడా తమ నివాసాలు, కార్యకలాపాలు కలిగిఉన్న అనేక మంది ఇతర తెలుగుదేశం నాయకుల ఫోన్లను కూడా జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేయించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీలోని అనేక మంది రాజకీయ నాయకులకు హైదరాబాదులో స్థిర నివాసాలు ఉన్నాయి. కేవలం తెలుగుదేశం వారు మాత్రమే కాదు.. ఇప్పుడు కూటమి పాలనలో అరెస్టు అవుతున్న వైసీపీ నేతలు చాలా మంది హైదరాబాదులోని నివాసాల్లో తలదాచుకుని దొరికిపోతున్న వారే. అప్పట్లో కూడా తెలుగుదేశం నేతలు హైదరాబాదులోని తమ నివాసాల్లోనూ కొంత కాలం గడుపుతూ ఉండేవారని అందరికీ తెలుసు. అలాంటి సమయాల్లో వారి ఫోన్లను కూడా ట్యాప్ చేయించి.. రహస్యాలు తెలుసుకునేందుకు జగన్ స్కెచ్ నడిపారనేది తాజా ఆరోపణ. చట్టాల ప్రకారం ఫోను ట్యాపింగ్ అనేది సీరియస్ నేరాల కిందికి వస్తుంది. తెలంగాణలో జరిగిన ఈ ట్యాపింగ్ దందాల్లో కేసీఆర్ దళాలు ఎంతగా ఇరుక్కోబోతున్నాయో, దాదాపు అదే స్థాయిలో జగన్ కూడా ఇరుక్కుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories