శుద్ధి మాత్రమేకాదు పాపపరిహారం అవసరం!

దేశంలో ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్! తిరుమల దేవుడికి ఇంత ఘోరమైన అపచారం చేస్తారా? ఈ దుర్మార్గానికి పరిహారం ఎలాగ? టీటీడీ కూడా ఇదే కసరత్తు చేస్తోంది. దేవుడి పట్ల ఎప్పుడైనా ఏదైనా అపచారం జరిగినప్పుడు శుద్ధి వంటి కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు జరిగినది తెలియక చేసిన తప్పు కూడా కాదు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా ఎవ్వరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఆగమ పండితులతో కలిసి.. జంతువుల కొవ్వులతో కూడిన కల్తీ నెయ్యిని ప్రసాదాల తయారీకి వినియోగించినందుకు ఎలాంటి పరిహారం చేయాలనే విషయంలో చర్చలు జరుపుతున్నారు. అయితే కేవలం టీటీడీ ఒక శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తే చాలదని.. నెయ్యి విషయంలో నాణ్యత లేదనే విషయం అప్పటి ఉద్యోగుల్లోనూ చాలా మందికి తెలిసే ఉంటుంది గనుక.. వారందరూ కూడా పాపపరిహారం కోసం ఏదో ఒకటి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుమల స్వామివారి ఆలయంలో చిన్న చిన్న తప్పులు జరిగినా కూడా.. పరిహారం కింద హోమాలు చేస్తుంటారు. అనునిత్యం రెండు పూటలా నిత్యహోమం నిర్వహిస్తుంటారు. స్వామివారికి కైంకర్యాలు, నైవేద్యాలు ఇతర కార్యక్రమాల్లో తెలిసీ తెలియక జరిగే తప్పులకు మన్నించమని వేడుకుంటూ చేసే హోమాలు అవి. అలాంటిది ఇప్పుడు నెయ్యి విషయంలో జరిగినది పొరబాటు కాదు.. హిందూ ధర్మం పట్ల, తిరుమల ఆలయ పవిత్రత పట్ల జరిగిన అతిపెద్ద ద్రోహం. ఇది తెలియక జరిగినది కూడా కాదు. తెలిసి చేసినదే. ఉద్దేశపూర్వకంగా చేసినదే కూడా అయి ఉండవచ్చు. ఈ ద్రోహం పాల్పడిన అసలు నేరస్తులు ఎవరైనప్పటికీ.. టీటీడీ ఉద్యోగుల్లో పలువురికి సంగతి తెలిసిఉంటుంది. జంతువుల కొవ్వులు నెయ్యిలో కలిపారని తెలియకపోయినా.. కనీసం.. లడ్డూతయారీకి వాడుతున్న నెయ్యి అత్యంత చవకబారుదని, కల్తీతో కూడినదనే సంగతి కొన్ని వందల మందికి తెలిసే ఉంటుంది. ఆ అవగాహన ఉద్యోగుల్లో ఇంకా కొన్ని వందల మందికి తెలిసే ఉంటుంది. తమకు తెలిసి కూడా మిన్నకుండిపోయినందుకు వారందరూ కూడా.. పాపపరిహారం చేసుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ఆయన  తెలిసి తప్పులు చేసిన ఇలాంటి టిటిడి ఉద్యోగుల్లోని దుర్మార్గులు.. తెలిసి నోరుమెదపకుండా ఉండిపోయిన వారు మాత్రమే అని ప్రజలు అంటున్నారు. తిరుమల స్వామివారి సేవల్లో జరిగిన పాపానికి పరిహారంగా టీటీడీ ఉద్యోగులు యావన్మందీ కలిసి మూకుమ్మడిగా తలనీలాలు తీయించుకుని స్వామివారిని తమ అపరాధానికి క్షమాపణ వేడుకోవాలని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories