ముంబాయికి చెందిన నటి.. తనను వంచించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరడమే ఆమె చేసిన పాపం! అందుకు.. ఏదో కక్ష కట్టినట్టుగా ఆమెతోపాటు కుటుంబసభ్యులందరినీ కూడా ముంబాయి నుంచి ట్రాన్సిట్ వారెంటు కూడా లేకుండా అరెస్టు చేసి తీసుకువచ్చి.. నిర్బంధించి.. కేసులు బనాయించి జైల్లో పెట్టి వేధించిన పాపం ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా.. వైసీపీ పెద్దల పురమాయింపుతో అప్పటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా స్వయంగా జోక్యం చేసుకుని, ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని పురమాయించి ముంబాయికి పంపి వారిని అరెస్టు చేయించి తీసుకువచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. కిందిస్థాయి పోలీసు సిబ్బంది వెల్లడిస్తున్న సమాచారాన్ని బట్టి.. కాంతిరాణాకంటె పైస్థాయి అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకుని.. ఏం చేయాలో, ఎలా వేధించాలో గైడెన్స్ ఇచ్చినట్టుగా తాజాగా తెలుస్తోంది.
ముంబాయి హీరోయిన్ కాదంబరి జత్వానీని వైసీపీ వారు చిత్రహింసలు పెట్టిన కేసు ఇప్పుడు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఆమె తాజాగా విజయవాడకు వచ్చి చంద్రబాబు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు కూడా! ఈ నేపథ్యంలో కిందిస్థాయి పోలీసు అధికారులు అసలు వాస్తవాన్ని వెల్లడిస్తున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ బాస్.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీరభక్తుడు అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని వారు బయటపెడుతున్నారు. దీంతో కాంతిరాణా తాతా, మరొక ఐపీఎస్ మాత్రమే కాకుండా.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కాదంబరికి పెళ్లి ఆశ చూపించి వివాహేతర సంబంధం కొనసాగించి, ఆమె పెళ్లి చేసుకోవాలని కోరిన తర్వాత… కేసులు పెట్టి వేధించిన వ్యక్తి వైసీపీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీచేసిన కుక్కల విద్యాసాగర్. ఆయన తనను ఆశ్రయించిన తర్వాత.. అప్పటి సకలశాఖ మంత్రి సజ్జల రామక్రిష్ణారెడ్డి పోలీసులను పురమాయించి.. ఈ బెదిరింపులు, అరెస్టుల వ్యవహారం నడిపించినట్టు పత్రికల్లో వచ్చింది. అయితే సజ్జల ఎంచక్కా మీడియా ముందుకు వచ్చి తన పేరు ప్రచురించిన పత్రికలమీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే ఆయన ఆదేశాల మేరకు అదుపు తప్పి వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులు తమ పరువు కాపాడుకోవడానికి అసలు సూత్రధారుల పేర్లు బయటపెడతారా? లేదా, తామే విచారణ ఎదుర్కొని శిక్షలు అనుభవించి కెరీర్ నాశనం చేసుకుంటారా? అనేది వేచిచూడాలి.