కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు తనను దారుణంగా తిరస్కరించినప్పటికీ.. ప్రజలు ఇచ్చిన ఒక్కచాన్స్ తోనే వారు విసిగి తనను సాధారణ ఎమ్మెల్యేగా పరిమితం చేసినప్పటికీ.. తాను కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికీ.. తనకు ముఖ్యమంత్రికి ఉండే స్థాయి పూర్తి భద్రత, సెక్యూరిటీ ఏర్పాట్లు, మందీ మార్బలం ఉండాలని హైకోర్టులో పిటిషన్ వేసి మరీ కోరడం ద్వారా జగన్ ఒకసారి నవ్వుల పాలయ్యారు. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి మరీ అంత లాజిక్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారా? అని అంతా అనుకున్నారు. చూడబోతే జగన్ ఒక్కడే కాదు. ఆయన బ్యాచ్ దళపతులు అందరూ కూడా ఇదే మాదిరి లాజిక్ లేకుండా ప్రవర్తించేలా, ఆలోచించేలా కనిపిస్తోంది. జగన్ పరిపాలన కాలంలో.. ఏఏజీ (అదనపు ఏజీ)గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఆ పదవినుంచి తాను మాజీ అయిపోయినప్పటికీ.. అప్పటిస్థాయి పోలీసు భద్రత ఇంకా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసి తన వాటా నవ్వులపాలు అయ్యారు. ఆయన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డిని జగన్ ప్రభుత్వ కాలంలో ఏఏజీగా నియమించుకున్నారు. పొన్నవోలు కు ఏ కారణాల చేత ఏఏజీ పదవి దిక్కిందనే దానిమీద జగన్ చెల్లెలు షర్మిల బోలెడు ఆరోపణలు చేస్తుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి ప్రధాన కారకుడైన పొన్నవోలుకు జగన్ ఏఏజీ పదవి కట్టబెట్టారంటూ షర్మిల అనేక ఆరోపణలు చేశారు. జగన్ – పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో సంబంధం ఉన్నదని వ్యాఖ్యానించారు. ఆ ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత.. అప్పటిదాకా ఏఏజీగా ఉన్న పొన్నవోలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు.
ఆయన తాజాగా హైకోర్టులో తనకు ఏఏజీగా ఉన్నప్పటి స్థాయి భద్రత కొనసాగించాలంటూ హైకోర్టులో కేసు వేశారు. రెడ్ బుక్ లో తన పేరు ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయని, కనుక తనకు భద్రత కల్పించాలని పొన్నవోలు హైకోర్టును కోరడం కొంచెం కామెడీగా కనిపించిందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఆయనకు ప్రాణహాని లేదనే అభిప్రాయానికి సెక్యూరిటీ రివ్యూ కమిటీ రావడం దురుద్దేశ పూరితం అనడానికి తగిన ఆధారాలు ఆయన కోర్టు ముందుంచలేదని హైకోర్టు అభిప్రాయపడింది. అందుచేత ఆయన వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అంతగా ఆయనకు ప్రాణభయం ఉంటే.. తాను సొంతంగా డబ్బులు చెల్లించి.. పోలీసు శాఖ నుంచి మనుషుల్ని తీసుకుని 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆదేశించింది. పొన్నవోలు అతిశయమైన కోరికలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా పలువురు భావిస్తున్నారు. దీనినుంచైనా జగన్ పాఠం నేర్చుకోవాలని అంటున్నారు.