ఉచిత ప్రయాణమే కాదు.. ఇంకా బోలెడు వస్తున్నాయ్!

మరో నెలరోజుల వ్యవధిలో సూపర్ సిక్స్ లోని మరొక కీలకమైన హామీ కార్యరూపం దాల్చబోతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల సాధికారతను పెంచేలా.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా ఉచిత బస్సు ప్రయాణం హామీ ఆగస్టు 15 నాటికి కార్యరూపం దాల్చనుంది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా… రాష్ట్రంలోని మహిళలకు వారి సొంత జిల్లాలో అన్ని ప్రాంతాలకు ఉచితంగా తిరిగేలా ఆర్టీసీ బస్సుల్లో అవకాశం కల్పిస్తామని చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ సదుపాయం ఉమ్మడి జిల్లాలకు కూడా వర్తించేలా మహిళలకు అవకాశం కల్పించనున్నారు. కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు.. ఆర్టీసీ పరంగా మేనిఫెస్టోలో లేని, ఎన్నికల సమయంలో ప్రకటించని అనేక పనులను కూడా అమలు చేయబోతున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వలన రద్దీ పెరుగుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ రద్దీని తట్టుకునేందుకు వీలుగా.. దాదాపు రెండువేల కొత్త బస్సులను ఆర్టీసికి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం వలన.. బస్సుల వద్ద సిగపట్లకు ఆస్కారం లేకుండా, మహిళలు కొట్టుకునే పరిస్థితి ఎదురుకాకుండా బస్సుల సంఖ్యను కూడా పెంచాలనుకోవడం చాలా మంచి పని.

ఉమ్మడి జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తే.. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన మహిళలు కూడా.. తమ సమీపంలో ఉండే నగరాలకు, పట్టణాలకు వెళ్లి.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం సాధ్యం అవుతుంది. చిన్న ఉద్యోగాలకు పట్టణాల దాకా వెళ్లాలంటే.. రవాణా ఖర్చులే జీతంలో సగానికి పైగా హరించుకుపోయే పరిస్థితుల్లో చాలా మంది అటు మొగ్గేవారు కాదు. ఇప్పుడు ప్రయాణం ఉచితం గనుక.. మహిళలు మరింత ఎక్కువగా ఉపాధి అవకాశాలు పొందడం సాధ్యమవుతుంది.
ఎటూ రద్దీ పెరుగుతుంది గనుక.. బస్సుస్టేషన్లలో తదనుగుణంగా ఇతర ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలు వేచి ఉండేందుకు వీలుగా కోట్ల రూపాయలు పెట్టి బెంచీలను ఏర్పాటు చేయిస్తున్నారు.అలాగే దాదాపు అయిదు కోట్ల రూపాయలతో బస్సాస్టాండుల్లోని మరుగుదొడ్లను బాగు చేయిస్తున్నారు. కొన్ని ప్రధాన ప్రాంతాలలో ఆధునికీకరిస్తున్నారు. 19 ప్రధాన బస్సుస్టాండ్లలో తాగునీటిశుద్ధి ప్లాంటులను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేమీ కూడా ఎన్నికల హామీల్లో మేనిఫెస్టోల్లో కనిపించేవి కాదు. కానీ.. కేవలం ఉచిత బస్సు ప్రయాణం కల్పించేసి రద్దీ పెంచేసినంత మాత్రాన చాలదు గనుక.. తదనుగుణంగా.. ఇతర ఏర్పాట్లు, ప్రయాణికులు, మహిళలకు తగుమాత్రం వసతులు కల్పించడానికి సర్కారు శ్రద్ధ పెడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories