అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి 15వేల కోట్లరూపాయల సాయం అందించబోతున్నాయనే వార్తలు కొత్తవి కాదు. అయితే ఈ వ్యవహారానికరి సంబంధించి తాజా అప్డేట్ చాలా ప్రోత్సాహకరమైనది. ఆశాజనకమైనది. మనీలాలో జరిగిన ఏడీబీ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి కోసం వారి తరఫున ఇచ్చే రుణానికి సంబంధించి ఆమోదం లభించింది. ఈనెల 19న జరిగే ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశంలో వారి అనుమతి కూడా లభిస్తుంది. ఈ నిధులలో 25 శాతం అంటే 3750 కోట్ల రూపాయలు జనవరిలో విడుదల అవుతాయి. అమరావతి మౌలికవసతులు, నిర్మాణ పనులు టెండర్ల పర్వం కూడా అప్పటికి పూర్తవుతుంది. పనులు శరవేగంగా జరగడానికి చంద్రబాబునాయుడు సంకల్పిస్తున్నట్టుగా మూడేళ్లలోగా ఈ నగరానికి ఒక రూపు తీసుకురావడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
అయితే తాజా కబురులో అన్నింటికంటె గొప్పగా కిక్కు ఇస్తున్న సంగతి మరొకటుంది. కేవలం రుణానికి ఏడీబీ ఆమోదం తెలపడమే అంటే అందులో విశేషం గానీ, కొత్తసంగతి గానీ లేదు. కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటినుంచే ఈ విషయం ప్రజలకు తెలుసు. అయితే ఏడీబీ బోర్డు సమావేశంలో ఆమోదం తెలియజేసిన సందర్భంగా.. ఏడీబీ డైరక్టర్ మియో ఓకా చేసిన వ్యాఖ్యలు గమనించాలి. అమరావతి రాజధానిని ప్రపంచం తలతిప్పి చూసేలా నిర్మించాలని అనుకుంటున్న చంద్రబాబునాయుడు సంకల్పానికి ఆయన మాటలు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉన్నాయి.
అమరావతి రాజధాని దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మియో ఓకా వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టు అని, ఈ నగరం గ్రోత్ హబ్ గా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజధానికి భూములిచ్చిన రైతులకు కేటాయించిన లేఅవుట్ ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర పనులకోసం ఈ నిధులను వెచ్చిస్తారు. అమరావతి హరిత ప్రాంతాల అభివృద్ధి, మెరుగైన రవాణా వ్యవస్థలు, మురుగునీటిపారుదల వ్యవస్థలు, వరద ముంపు నివారణ ఏర్పాట్ల విషయంలో ఆదర్శ నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అంటున్నారు. మన అమరావతి నగరం గురించి ఆయన వ్యక్తీకరిస్తున్న మాటలే.. నిధుల కంటె గొప్ప ప్రోత్సాహంగా కనిపిస్తున్నాయని పలువురు భావిస్తున్నారు.