అమరావతి రాజధాని స్వప్నం సాకారం అయ్యే దిశగా ఒక మంచి ముందడుగు పడింది. ప్రస్తుతం పిచ్చిమొక్కలు మొలిచిన స్మశానంలాగా ఉన్న అమరావతి రాజధాని ప్రాంతం.. సరిగ్గా ఒకనెలరోజుల్లోగా.. నిర్మాణాలు ప్రారంభించడానికి అనువైన సువిశాల మైదానంలాంటి రూపాన్ని సంతరించుకోనుంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ బుధవారం ప్రారంభించారు. ఆ ప్రాంత రైతులు, రాష్ట్రప్రజలు మాత్రం ఇది జంగిల్ క్లియరెన్స్ కాదని.. అమరావతి మీద జరిగిన కుట్రల క్లియరెన్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతి రాజధానిని తలపెట్టి 51 వేల ఎకరాలను రైతులనుంచి సమీకరించారు. ఆ ప్రాంతాన్ని మొత్తం ఒక స్థాయికి తీర్చారు. నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు, సచివాలయం అక్కడే ఏర్పడ్డాయి. ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అమరావతి ప్రాంతంపై విషం చిమ్మింది. అన్ని పనులను స్తంభింపజేసేసింది. 70 -80 శాతం పూర్తయిన ఐఏఎస్ అధికారుల, జడ్జిల క్వార్టర్లు సహా అన్నీ నిలిచిపోయాయి. అయిదేళ్లపాటూ వీటిగురించి పట్టించుకున్న నాధుడు లేడు. అంతా కర్రతుమ్మ చెట్లు మొలిచి, అమరావతి ప్రాంతం మొత్తం అడవిలాగా తయారైంది. ఈ ప్రాంతం మీద జగన్ కుట్రలకు జనం ఎన్నికల్లో చెక్ పెట్టారు. మూడు రాజధానుల డ్రామాను తిప్పికొట్టారు.
చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతమంతా తిరిగి పరిశీలించి.. పనుల పునరుద్ధరుణకు సిగ్నల్ ఇచ్చారు. అడవిలా మారిన పిచ్చిచెట్లను, కర్రతుమ్మ ముళ్ల చెట్లను తొలగించేందుకు 36 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు బుధవారం ప్రారంభం అయ్యాయి. ఒక నెలరోజుల్లోగా ఈ పనులు మొత్తం పూర్తిచేస్తాం అని మంత్రి నారాయణ ప్రకటించారు. అదే జరిగితే.. నెలగడిచేసరికెల్లా.. అమరావతి ప్రాంతం నిర్మాణాలకు యోగ్యమైన ఆకర్షణీయమైన ప్రాంతంగా మారిపోతుందనడంలో సందేహం లేదు.
పైగా ఈ పనులు పూర్తయిన తర్వాత.. ఇప్పటికే రాజధానిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములను వారికి అప్పజెబుతారు. అందులో కేంద్రప్రభుత్వ రంగ సంస్థలే 130 వరకు ఉన్నాయి.
చంద్రసర్కారు ఏర్పడిన తర్వాత.. సీఆర్డీయే సంప్రదించినప్పుడు.. తమకు స్థలాలు ఎక్కడున్నాయో చూపిస్తే నిర్మాణాలు చేపడతామని ఆ సంస్థలు పేర్కొన్నాయి. స్థలాలు పొందిన సంస్థలన్నీ రెండేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని కూడా చంద్రబాబునాయుడు అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే మరో రెండేళ్లు గడిచేసరికి అమరావతి ప్రాంతం వైభవమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని ప్రజలు నమ్ముతున్నారు.