సభనుంచే కాదు.. సొంత ఊరినుంచీ పరారీ!

ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి.. తన ప్రత్యర్థులు అధికార హోదాలో ఉండగా చూసి ఓర్వలేక శాసనసభ నుంచి పరారయ్యారని ఒకవైపు రాజధాని అమరావతిలో అనుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి, వారందరి కష్టనష్టాలు తెలుసుకుంటారని.. పూర్తిగా అయిదు రోజుల పాటు అక్కడే ఉండి ప్రజలను కలుస్తారని షెడ్యూలు ప్రకటించి.. పులివెందులకు వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఆయనకు కొత్త తలనొప్పి ఎదురైంది. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన అనేకమంది కార్యకర్తలు, లోకల్ నాయకులు గుంపులుగుంపులుగా ఆయనను కలిశారు. తమ బిల్లుల పరిస్థితేంటంటూ మొరపెట్టుకున్నారు. పార్టీకి రాజీనామా చేసేస్తామని కూడా హెచ్చరించారు. ఇన్ని ఒత్తిడుల నడుమ జగన్ పులివెందులలో ప్రకటించిన అయిదురోజుల టూరు షెడ్యూల్ ను కనీసం మూడు రోజులు కూడా పూర్తిగా గడపకుండా, అక్కడినుంచి బెంగుళూరు ప్యాలెస్ కు భార్యాసమేతంగా పారిపోయారు.

రాష్ట్రమంతా ప్రజలు దారుణంగా ఓడించి ఇంట్లో కూర్చోబెడితే.. పులివెందులలో అయిదురోజులు గడపడం తనలోని ఫ్రస్ట్రేషన్ కు మందులాగా పనిచేస్తుందని జగన్ తలపోశారు. శాసనసభ మొదటిరోజున ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం తప్పదు గనుక.. ఆరోజు కొన్ని నిమిషాలు సభలో ఉండి.. ప్రమాణం చేశారు. మొహం చెల్లక అప్పుడే ఇంటికి పారిపోయారు. రెండోరోజు స్పీకరు ఎన్నిక లాంఛనం జరగాల్సి ఉన్న రోజున.. ఒక పార్టీకి నాయకుడు అయిన జగన్ హాజరు కాకుండా.. ఏకంగా తాడేపల్లినుంచే పారిపోయి పులివెందుల వెళ్లిపోయారు. పులివెందులలో అయితే జనం తనకు నీరాజనాలు పడుతూ ఉంటారని.. ఆ మూడ్ కాస్త బెటర్ అని అనుకున్నారు.

జనం నీరాజనాలు పట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ.. అక్కడ పనులు చేసిన చిన్నా సన్నా కాంట్రాక్టర్లందరూ చుట్టుముట్టి బిల్లుల గురించి గోల చేయడం ఆయనకు చిరాకు తెప్పించింది. కేవలం కాంట్రాక్టుల రూపేణా కార్యకర్తలకు దోచిపెట్టడానికి పులివెందుల రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఏర్పాటుచేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటినుంచి దాదాపు 963 కోట్ల రూపాయల పనులు ప్రతిపాదించారు. వాటిలో చాలా ఎందుకూ కొరగానివి. కేవలం కార్యకర్తలకు మేలు కోసం ఉద్దేశించినవి. బడా కాంట్రాక్టర్లు బిల్లులు దక్కించుకున్న లోకల్ కేడర్ చేసిన కాంట్రాక్టులకు బిల్లులు రాలేదు. అదే ఆయనకు తలనొప్పి అయింది. కోర్టుకు వెళ్లి బిల్లులు తెచ్చుకుందాం అన్నా.. వారు సహించలేకపోయారు. పెద్దిరెడ్డి కంపెనీలకు ఎన్నికల వేళ కూడా బిల్లులు చెల్లించారంటూ వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ తలనొప్పులన్నీ భరించలేక జగన్, భార్య భారతితో కలిసి తన అయిదురోజుల పులివెందుల టూర్ ను రెండున్నర రోజులకే ముగించారు. హడావుడిగా బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. పాపం జగన్ కు ఇంత దారుణమైన ఓటమి దక్కేసరికి శాసనసభ నుంచి మాత్రమే కాదు, సొంత నియోజకవర్గం నుంచి కూడా పారిపావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories