దళారీతనం కాదు.. ‘దళారీల తయారీ’ చేపట్టిన జగన్ టీటీడీ!

అధికారం తమ చేతిలో ఉంటే ఆ పార్టీ నాయకులంతా రకరకాల దళారీ అవతారాలు ఎత్తి ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని, ఆదాయం దండిగా ఉండే అన్ని రకాల వ్యవస్థలను కూడా దోచుకోవడం చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో మూడుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామకాలు జరిగాయి. వైవీసుబ్బారెడ్డి రెండుసార్లు, భూమన కరుణాకర్ రెడ్డి ఒకసారి ఛైర్మన్ లు అయి తమ దందాలు కొనసాగించారు. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వివరాల ప్రకారం.. వీరు తమ తైనాతీలతో దళారీ పనులు చేయించడం మాత్రమే కాదు.. వీవీఐపీలను కూడా దళారీలుగా తయారుచేసే సరికొత్త నిర్ణయాలను అమల్లోకి తీసుకువచ్చారు.

తిరుమల స్వామివారి సేవలో ఉదయాస్తమాన సేవ అనేది అన్నింటికంటె అత్యంత విలువైన సేవగా గుర్తింపు ఉన్నది. ఈ సేవ టికెట్ ధర  మామూలు రోజుల్లో అయితే రూ.కోటి, శుక్రవారాల్లో రూ.కోటిన్నర! ఈ సేవ టికెట్ తీసుకున్న వారు.. 25 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం తాము కోరుకున్న ఒక రోజున తిరుమలేశునికి ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే అన్ని ఆర్జిత సేవలలోనూ పాల్గొనవచ్చు. ఒక టికెట్ మీద వారు ముందుగానే ఆన్ లైన్ లో పేర్కొన్న అయిదుగురిని అనుమతిస్తారు. ఆ అయిదుగురు మాత్రమే అన్ని సేవల్లోనూ 25 ఏళ్లపాటు పాల్గొనడానికి అధికారం ఉంటుంది. ఇలాంటి ఉదయాస్తమాన సేవ టికెట్లను జగన్ ప్రభుత్వ హయాంలో.. ఏకంగా 531 ఆన్ లైన్ లో విడుదల చేస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ డిమాండును గమనించి.. అప్పటి బోర్డు గతంలో బుక్ చేసుకుని.. 25 ఏళ్ల కాలం వాడుకోకుండా చనిపోయిన గడువు ముగిసిన వారి టికెట్లను కూడా ఆఫ్ లైన్ లో ఎలాంటి ప్రకటన లేకుండా రూ.కోటిన్నర వంతున అమ్మేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే టీటీడీలో భూమన పాలన మొదలయ్యాక ఇంకో దుర్మార్గం జరిగింది. ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ తీసుకున్న వాళ్లు నిబంధనల ప్రకారం.. ముందుగా ఆన్ లైన్ లో పేర్కొన్న అయిదుగురు మాత్రమే అన్ని సేవలకు హాజరు కావాలి. అలాకాకుండా.. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే వివిధ రకాల సేవలకు వేర్వేరు వ్యక్తులనుల వెంట తీసుకుని వెళ్లేలా నిబంధనలు మార్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరు సేవలు ఉంటాయనుకుంటే..  ఒక టికెట్ మీద 30 మంది సేవల్లో పాల్గొనే అవకాశం వస్తుందన్నమాట. కొన్నిసేవలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒకసారి కోటిరూపాయల టికెట్ కొన్నవారు.. ఒక్కోసేవకు వేర్వేరు వ్యక్తులను తీసుకెళ్తూ వారినుంచి లక్షల్లో మారు బేరానికి ఆ అవకాశాన్ని అమ్ముకునే దళారి తనానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇలా వీవీఐపీలను కూడా దళారీలుగా మార్చే వ్యవస్థ వచ్చింది. దీనిపై ఇప్పుడు కూలంకషంగా విచారణ జరిపి నియమాలు మార్చాలని పలువురు కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories