ఏకంగా 59 నామినేటెడ్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబితా పట్ల మూడు పార్టీల నేతల్లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి, త్యాగాలు చేసిన వారికి అందరికీ తగు విధంగా ప్రాధాన్యం ఇస్తూ నామినేటెడ్ పదవులను పంచారని అందరూ హేపీగా ఉన్నారు. ఈ పదవుల విషయంలో కూడా ఎన్నికల సమయంలో మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందానికి తగినట్టుగా.. అదే దామాషాలో భాగస్వామ్య పార్టీలకు కూడా చంద్రబాబునాయుడు అవకాశం కల్పించడంతో.. ఇక వివాదానికి అసంతృప్తులకు తావులేకుండాపోయింది.
నామినేటెడ్ పదవుల రెండో జాబితా ఫైనలైజ్ చేయడానికి తుది కసరత్తు జరుగుతున్న సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వెళ్లి చంద్రబాబును ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ ఇద్దరు నాయకులు సుదీర్ఘంగా గంటన్నరకు పైగా భేటీ కావడం అందరికీ ఆసక్తి కలిగించింది. ఆ భేటీలోనే జనసేన తరఫు పేర్లతో జాబితాకు తుదిరూపు తీసుకువచ్చినట్టుగా, కొన్ని మార్పుచేర్పులు జరిగినట్టుగా వెలగపూడి సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో నిరాశకు గురైన చాలా మంది నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం దక్కింది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఫిరాయించిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి, నిత్యం సాధికారమైన సాక్ష్యాల సహా జగన్ యొక్క లోపాలను ఎత్తిచూపుతూ ఉండే, పాత ప్రభుత్వ కాలంలో కూడా పోరాట దృక్పథాన్ని ప్రదర్శించిన ఆనం వెంకటరమణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసి దారుణంగా కొట్టించిన కొమ్మారెడ్డి పట్టాభిరాం వంటి వారందరూ ఈ జాబితాలో పదవులు పొందారు.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును రాష్ట్రప్రభుత్వ నైతిక విలువల సలహాదారుగా నియమించడం పట్ల సర్వత్రా ఆమోదం వ్యక్తం అవుతోంది. ఆయనకు ఏకంగా కేబినెట్ రాంకు ఇవ్వడం సముచితమైన గౌరవం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తన మీద ఉన్న క్రిస్టియానిటీ అనుకూల ముద్రను తొలగించుకోవడానికి జగన్, చాగంటికి టీటీడీ ధర్మప్రచారపరిషత్ సలహాదారు పదవి కట్టబెట్టారు. అయితే ఆ పదవిని తనకు వద్దని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇచ్చిన పదవిని ఆమోదించడమే.. ఈ ప్రభుత్వానికి గౌరవం అని పలువురు భావిస్తున్నారు.