త్వరలోనే తీరనున్న నామినేటెడ్ కలలు! 

తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 75 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా నామినేటెడ్ పదవుల పందేరం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఇంతకాలం సమయం సరిపోయింది. కొంతకాలంగా నామినేటెడ్ పదవుల పంపకంపై తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తూ వస్తోంది. పాలని చేపట్టి వంద రోజులు పూర్తి అయ్యేలోగా నామినేటెడ్ పదవుల పందేరం పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడు తాజాగా చెబుతున్నారు. సొంత పార్టీలో గాని, కూటమి భాగస్వామి పార్టీలలో గాని ఎలాంటి అసంతృప్తి పొడచూపే అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు పదవులు పంచబోతున్నట్లుగా తెలుస్తోంది. 

ఎన్నికల సమయంలో సీట్లు పంచుకున్న దామాషాలోనే నామినేటెడ్ పదవుల పంపకం కూడా ఉంటుందని ఇదివరకే సంకేతాలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రతి సంస్థలోనూ దామాషాల ప్రకారం జనసేన, బిజెపి లకు కొన్ని స్థానాలు కేటాయిస్తారు. ఆయా పార్టీలు సిఫారసు చేసే పేర్లకు మాత్రమే ఆ పదవులు కేటాయిస్తారు. తెలుగుదేశం కు సంబంధించిన పేర్లలో తప్ప ఇతర పార్టీలు సూచించే పేర్ల విషయంలో తాను జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనివలన కూటమి పార్టీల మధ్య అసంతృప్తి రేగకుండా ఉంటుందనేది ఆయన అభిప్రాయంగా ఉంది. 

సెప్టెంబరు నాలుగో తేదీ నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత విలువైనది టీటీడీ కావడంతో దానికోసం పోటీపడుతున్న వారి సంఖ్య, ఒత్తిడి చేస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బ్రహ్మోత్సవాలు మొదలయ్యే లోగానే టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకారం ఉంటుందని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. టీవీ5 మీడియా గ్రూపు యజమాని బిఆర్ నాయుడు పేరు టిటిడి అధ్యక్ష స్థానానికి ప్రముఖంగా వినిపిస్తుంది. ఇతర ఒత్తిడి లేని పనిచేయకపోతే అదే ఖరారు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అసంతృప్తులకు, అలకలకు అవకాశం లేకుండా పార్టీలు అంతర్గతంగాను.. కూటమిగాను ఐక్యంగా పనిచేసిన విధంగానే.. నామినేటెడ్ పదవులు పంపకాన్ని స్మూత్ గా ముగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories