‘వై నాట్ 175’ అనే ఆడంబరపు మాట తమ పార్టీ నినాదంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. పోయినసారి ఎన్నికల సమయానికి ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో ప్రజల మధ్యకు వెళితే, ఈసారి ‘వై నాట్ 175’ అన్నదే ప్రధాన నినాదంగా ఉంది! ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి నూరు శాతం సీట్లు గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి దగ్గరి నుంచి ఆ పార్టీ కిందిస్థాయి నాయకుల వరకు చాలా డాంబికంగా పలుకుతున్నారు.
అలాంటి నేపథ్యంలో ‘మేమంతా సిద్ధం’ అంటూ తండ్రికి నివాళులు అర్పించిన తర్వాత బస్సు యాత్ర ప్రారంభించారు జగన్. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ కాస్తా, జనం హాజరు లేక దారుణంగా విఫలం కావడం జగన్మోహన్ రెడ్డిలో ఆగ్రహానికి కారణం అవుతోంది. ప్రొద్దుటూరులో జరిగిన సభకు జన సమీకరణ చేయలేకపోయిన సొంత పార్టీ నాయకుల చేతగానితనం మీద, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిందులు తొక్కినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సభకు జనం హాజరు అత్యంత పలుచగా ఉండడం ఆయన ఆగ్రహానికి ఒక కారణం అయితే, ఒకవైపు జగన్ ప్రసంగం సాగుతూ ఉండగానే ప్రజలు లేచి సభాస్థలి నుంచి బయటకు వెళ్లిపోవడం ఇంకొక కారణం! ఎన్ని ఏర్పాట్లు చేసినా, ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి సభకు తీసుకువచ్చినా తమ పని కాగానే వారు వెళ్ళిపోతున్నారు తప్ప సభ పూర్తి అయ్యేదాకా ఉండడం లేదని నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రొద్దుటూరులో జనం హాజరు లేక వైయస్సార్ కాంగ్రెస్ సభ విఫలం కావడం అనేది ముందు ముందు సభలు జరగబోయే అన్ని ప్రాంతాలకు ఒక హెచ్చరిక లాంటిదని పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి. ముందు ముందు జరగబోయే ప్రతి సభకు కూడా విపరీతంగా జన సమీకరణ జరగాలని జగన్ తరఫున ఇప్పటికే ఆయా ప్రాంతాల అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. డబ్బు ఇవ్వగలం, లిక్కర్ పంపిణీ చేయగలం, బిర్యానీలు తినిపించగలం..
అయితే జనాన్ని సభ ముగిసే దాకా కూర్చుండబెట్టడం ఎలాగా అనేది స్థానిక నాయకులకు కూడా అర్థం కావడం లేదు! మధ్యలో వాళ్లు వెళ్లిపోతే మేము ఏం చేయగలం అని తమలో తాము మధనపడుతున్నారు. తన సభలకు జనాన్ని తీసుకురాలేకపోవడం అనేది అభ్యర్థుల వైఫల్యం లాగా జగన్ చూస్తారేమో అని భయపడుతున్నారు.
ప్రొద్దుటూరు సభను ఆయన సొంత టీవీచానెల్ కవర్ చేసిన తీరు గమనిస్తే చాలు.. జనం ఎంత పలచగా వచ్చారో అర్తమైపోతుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డ్రోన్ షాట్లు లాంగ్ వ్యూలో అస్సలు చూపించకుండా.. జనాన్ని క్లోజ్ లో రద్దగా ఉన్న ప్రాంతాలను మాత్రం చూపిస్తూ.. ఎక్కువగా స్టేజీని మాత్రమే కవర్ చేస్తూ పాపం వారు మేనేజ్ చేశారు. ఇలాంటి కవరేజీ ద్వారా ఆ చానెల్ చూసే ప్రజలను మాయ చేయగలరు తప్ప.. స్వయంగా సభకు ఎందరు వచ్చారో.. ఎందరు పారిపోయారో చూసిన జగన్ కు.. ముందుముందు ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతున్నదో క్లారిటీ వచ్చి ఉంటుంది కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.