జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యావిధానం ప్రవేశపెడుతున్నట్టుగా చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఆ విధానాన్నే అమలు చేస్తూ వచ్చారు. అయితే.. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా.. సీబీఎస్ఈ విధానానికి తగిన విధంగా విద్యార్థులు తర్ఫీదు అయిఉన్నారా? ఆ సిలబస్ ను వారు అందుకోగలరా? అని ఆయన పట్టించుకోలేదు. అదే విధంగా సీబీఎస్ఈ విధానంలో బోధన సాగించేలా ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం గురించి కూడా ఆయన పట్టించుకోలేదు. కేవలం ట్యాబ్ లు ఇస్తా, బైజూస్ కోచింగ్ సెంటరు పాఠాలు చెప్పిస్తా.. అంటూ మాయమాటలు చెప్పి విద్యార్థి ప్రపంచాన్ని మభ్యపెట్టారు. తీరా విద్యార్థులు ఆ పరీక్షలకు సిద్ధం కావాడానికి నానా పాట్లు పడే దుస్థితి కల్పించారు. ఈ పోకడలన్నీ గమనించి.. జగన్ కు తన ప్రచారం పిచ్చి మినహా, క్షేత్రస్థాయిలో ఉండగల వాస్తవాల గురించి పట్టింపులేదా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేష్.. ఆ వాస్తవాలను బయటపెట్టేవరకు ప్రజలందరూ కూడా ఒక మాయలోనే ఉన్నారు. సీబీఎస్ఈ విధానం తెస్తే మంచిదే కదా.. దానిని కూడా అభ్యంతరపెట్టడం తప్పుకదా అనుకుంటూ వచ్చారు. అయితే నారాలోకేష్ పాఠశాలల్లో ఉన్న పరిస్థితుల్ని స్వయంగా అవగతం చేసుకున్నతరవాత.. అసలు సంగతి చెబుతున్నారు.
సీబీఎస్ఈ విధానం అనే అందమైన మాటను జగన్ ప్రయోగించారే తప్ప.. దానికి తగ్గట్టుగా విద్యార్థుల్ని సిద్ధం చేయడంలో ఫెయిలయ్యారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ లు ఇవ్వకుండానే.. సీబీఎస్ఈలోకి మార్చడం వలన.. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆయన అంటున్నారు.అయితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ విధానం పట్ల తన వ్యతిరేకతను వెలిబుచ్చడం లేదు. కేవలం.. విధానంలో నెమ్మదిగా మార్పులు తెచ్చి.. పిల్లలను సిద్ధం చేసి.. టీచర్లకు మెరగైన శిక్షణలు ఇప్పించి.. ఆ తర్వాత మాత్రమే పిల్లలను పరీక్షలకు పంపేలా ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి జగన్ చేసిన పాపాలను, కీర్తి కండూతితో పిల్లల జీవితాలతో ఆడుకున్న వైనంలను కూడా చక్కదిద్దడం మాత్రమే ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అయిపోయినట్టుగా కనిపిస్తోంది.