సీనియర్ ఐపీఎస్ అధికారి, గతంలో సీఐడీ చీఫ్ గా కూడా పనిచేసిన సంజయ్ ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి ఆయన ఎన్ని రకాల ప్రయత్నాల చేసినప్పటికీ, ఎత్తుగడలు వేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. రెండు కోట్ల రూపాయలకు పైగా అవినీతి చేసిన కేసుల్లో మొదటి నిందితుడు అయిన ఐపీఎస్ సంజయ్ కు, ఆరునెలల కిందట ఏపీ హైకోర్టు కల్పించిన ఊరట ఆవిరైపోయింది. అసలు ఈ కేసు పూర్వాపరాలను గమనిస్తోంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని, హైకోర్టు తీర్పు అసమంజసంగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఆ ముందస్తు బెయిలును సుప్రీం కోర్టు కొట్టి వేయడం తాజా పరిణామం. పర్యవసానంగా ఐపీఎస్ సంజయ్ మూడు వారాల్లోగా కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. కటకటాలు తప్పవు. ఆ తర్వాత కావలిస్తే.. ఆయన బెయిలుకోసం పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే.. ఆయనను తమ కస్టడీకి తీసుకోని విచారించాలని పోలీసులు భావిస్తే వారు కూడా అందుకోసం కోర్టులో పిటిషన్ వేసుకుని, కస్టడీకి తీసుకోవచ్చు. కటకటాల్లోకి వెళ్లకుండానే కాలయాపన చేయాలని సంజయ్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయినట్టే.
సంజయ్ గతంలో సీఐడీ చీఫ్ గా వచ్చి.. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసం ఆయన రాజకీయ ప్రత్యర్థులను, వ్యాపార ప్రత్యార్థులను ఎన్ని రకాలుగా వేధించారో అందరికీ తెలుసు. నిజానికి ఆ పాపాలు, వాటి వెనుక ఉన్న కుట్రలు ఇంకా వెలుగులోకి రానేలేదు. కూటమి సర్కారు వాటి గురించి దృష్టి సారించనేలేదు. సీఐడీచీఫ్ గా రావడానికి ముందు అగ్నిమాపక శాఖ డైరక్టరుగా ఉంటూ పాల్పడిన అవినీతి బాగోతమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. మొత్తం రెండు కోట్ల రూపాయలు కాజేసినట్టుగా కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఏసీబీ పోలీసుల వాదనలు పూర్తిగా వినకుండానే.. దాదాపుగా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చరేస్తూ ఈ ఏడాది జనవరి 30న ఏపీ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. కేసు ట్రయల్ మొత్తం పూర్తయిపోయిన తీరులో ముందస్తు బెయిలు విషయంలోనే ఏకంగా 49 పేజీల తీర్పు ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన తర్వాత ఈ తీర్పు చూసి వారు కూడా నివ్వెర పోయారు. ఈలోగా సంజయ్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలకు రాకుండా వాయిదాలు అడుగుతుండడం పట్ల సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఎట్టి పరిస్థితుల్లో ఆయన రావాలని సూచించింది. దాంతో కపిల్ సిబల్ గురువారం హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మాసనం సంజయ్ కు గతంలో హైకోర్టు ఇచ్చిన బెయిలును రద్దు చేసింది.
కపిల్ సిబల్ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. సంజయ్ బెయిలు రద్దుచేసి మూడు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కనీసం కస్టడీకి ఇవ్వకుండా చూడాలని అడిగినా కూడా కోర్టు తిరస్కరించింది. విచారణ మొదలు పెట్టిన తర్వాత ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావొచ్చు కదా అని వ్యాఖ్యానించింది.
పైగా ఈ కేసును వింటున్న కొద్దీ.. ఆయన నిర్వహణలో అగ్నిమాపక శాఖలో జరిగిన అవినీతి గురించి అనేక అనుమానాలు వస్తున్నాయంటూ సుప్రీం వ్యాఖ్యానించడం విశేషం. ఎస్సీ ఎస్టీలకు శిక్షణల ముసుగులో కాజేసిన నిధులు, ఇతర అవినీతి విషయంలో సంజయ్ జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది.