జగన్ ఎంత కక్ష కట్టినా.. ఆయన వన్నె తగ్గలేదు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు ఇచ్చిన అవకాశం కారణంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఒక ఫ్యాక్షనిస్టులాగా.. కక్ష తీర్చుకోవడానికే ఆ పదవీకాలాన్ని ఎక్కువగా వాడుకున్నారనే ఆరోపణలకు అనేక ఉదాహరణలు దొరకుతాయి. అలాంటివాటిలో.. ఆయన పాలన కాలంలో.. అనేక విధాలుగా వేధింపులకు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైనమే తార్కాణం. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పట్ల, జగన్మోహన్ రెడ్డి అకారణ ద్వేషం పెంచుకున్నారు. ఆయనను టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏవేవో లోపాలు వెతికి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ నిందలు వేసి అవేవీ నిరూపణ కాకుండానే.. ఆయనను విధులనుంచి సస్పెండ్ చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావు ఊరుకోలేదు. క్యాట్ కు వెళ్లారు. కోర్టులను ఆశ్రయించారు. అక్కడినుంచి తన మీద సస్నెన్షన్ వేటు వేయడం అక్రమం అంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. గతిలేని పరిస్థితుల్లో ఆయనను తిరిగి సర్వీసులోకి తీసుకోవాల్సి వచ్చింది. చాలాకాలం పోస్టింగు ఇవ్వకుండా వేధించారు. మళ్లీ సస్పెండు చేశారు. ఆయన మళ్లీ న్యాయపోరాటం సాగించి.. చివరికి సుప్రీం కోర్టు ద్వారా.. తిరిగి తనను విధుల్లో చేర్చుకుని పోస్టింగు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా సుదీర్ఘకాలం ఆయనకు పోస్టింగు ఇవ్వకుండా వేధించిన జగన్ సర్కార్.. ఆయన పదవీ విరమణకు కొన్ని రోజుల ముందు ఒక అప్రాధాన్య పోస్టు కేటాయించారు. మొత్తానికి ఆయనను అన్ని రకాలుగా వేధించింది జగన్ సర్కారు.

అయితే పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాంటారు పెద్దలు.  జగన్ వేధింపుల వలన.. ఏబీ వెంకటేశ్వరరావు కొంతకాలం మనోవేదనకు గురై ఉండవచ్చు గాక.. కొన్ని అవమానాలను భరించాల్సి వచ్చి ఉండొచ్చు గాక.. కానీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన అనుభవించిన వేదనకు ఉపశమనం లభించింది. జగన్ పరిపాలన కాలంలో.. రెండు దఫాలుగా కొనసాగిన ఆయనపై సస్పెన్షన్ పీరియడ్ ను ఎన్డీయే సర్కారు క్రమబద్ధీకరించింది.

తాజాగా ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ పోలీసు గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. వ్యక్తుల పట్ల అకారణ ద్వేష భావంతో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి.. మహా అయితే గ్రహణం పట్టినట్టుగా కొన్నాళ్లు వేధించగలరేమో గానీ.. సమర్థుల అవకాశాలను ఎప్పటికీ సమూలంగా తుడిచిపెట్టలేరని ఏబీ వెంకటేశ్వరరావు ఉదాహరణ నిరూపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories