లెంపలేసుకున్నా సరే నో  ఎంట్రీ !!

ఎన్నికలకు ముందు అధికార పార్టీతో అంటకాగుతూ వారు చెలరేగిపోయారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రలోభ పెడితే వాటికి లొంగిపోయారు. వారు ఇచ్చిన తాయిలాలకు, నగదు కానుకలకు ఆశపడి వారికి అనుకూలంగా ఎగబడి పని చేశారు.  ఫ్యాను గుర్తుకు ఓటు వేయించడానికి తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ.. క్షేత్రస్థాయి ప్రచారానికి తెగించారు. ప్రజల తీర్పు తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది. ఇప్పుడేమో ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు. తమకు తాముగా రాజీనామా చేసిన ఉద్యోగాల్లోకి.. తమను తిరిగి తీసుకోవాలంటూ ఆందోళనలకు దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి ఇది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కుటిల రాజకీయ నీతి.. రాష్ట్రంలోని యువతరం జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నదో తెలుసుకోవడానికి వాలంటీర్ల జీవితాలే పెద్ద ఉదాహరణ. ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడానికి అడ్డగోలుగా వాడుకోవటం ఒక్కటే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు వారి ద్వారా పెన్షన్ల పంపిణీ చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. దాంతో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను మభ్యపెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించ గల అవకాశాలు తగ్గిపోయాయి. వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ‘మళ్లీ అధికారంలోకి మనమే వస్తున్నాం. మీ ఉద్యోగాలు మళ్ళీ మీకు ఇస్తాం. అప్పటిదాకా రాజీనామా చేసేసి మన పార్టీ కోసం ప్రచారం చేయండి’ అని ప్రలోభ పెట్టడంతో వేల సంఖ్యలో వాలంటీర్లు లొంగిపోయారు. అసలే మెజారిటీ వైసీపీ కార్యకర్తలే అయిన వాలంటీర్లు ఆ పార్టీ కోసం పనిచేయడానికి ఎగబడ్డారు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వం వస్తే వాలంటీర్ల వేతనాన్ని ఐదు నుంచి పదివేల రూపాయలకు పెంచుతానని ప్రకటించినప్పటికీ ఇలాంటి కరడుగట్టిన వైసిపి కార్యకర్తలకు పట్టలేదు. రాజీనామా చేసి వైసిపి ప్రచారంలో తరించారు.

తీరా ఆ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు వారికి కళ్ళు తెరుచుకున్నాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల సంఖ్యను సగానికి కుదించి బాధ్యతలు కాస్త పెంచి పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జీతం పెరుగుతున్న సమయంలో తాము ఉద్యోగాన్ని కాలదన్నుకున్నామనే పశ్చాత్తాపం వారిలో కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఆందోళనలు చేస్తూ తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వీరు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకుల ప్రలోభాలకు లోబడి రాజీనామా చేసిన వాలంటీర్ల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా! నిజానికి వీరి రాజీనామాతో మిగిలిన వారికి వేతనం 10000 కు పెంచి వ్యవస్థను అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి సులువు. కానీ ఇప్పుడు వీరు ఆందోళనలకు దిగుతున్న తీరు గమనిస్తుంటే వీరికి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమేనా? అసలు కరెక్టేనా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారు వీరి పట్ల ఎలా వ్యవహరిస్తుందో చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories