వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల మీద విచ్చలవిడిగా దండయాత్ర సాగించిన వ్యక్తి రఘురామక్రిష్ణ రాజు. ఢిల్లీ నుంచి రచ్చబండ పేరుతో వారానికి ఒకసారి యూట్యూబ్ లైవ్ లతో.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు, అందులోని అరాచకత్వాల గురించి ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం గురించి ఆయన పదేపదే చెబుతూ వచ్చారు. ఆయన రచ్చబండ కార్యక్రమానికి తెలుగు ప్రజల్లో విస్తృతమైన ఆదరణ ఉండేది.
అలాంటి రఘురామక్రిష్ణ రాజు ఇప్పుడు తెలుగుదేశంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను తెలుగుదేశం లో చేరిన తర్వాత భవిష్యత్ వ్యూహం గురించి అడిగినప్పుడు.. మే11 వ తేదీ వరకు తన రచ్చబండ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అంటే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాల గురించి ఉతికి ఆరేయడం అనే ప్రక్రయి మే 11 వరకు అనగా, పోలింగ్ కు రెండు రోజుల ముందు వరకు కొనసాగిస్తారన్నమాట. ఎన్నికల ప్రచారానికి తుది గడువు వరకు తన రచ్చబండ ఉతికి ఆరేయడం కంటిన్యూ అవుతుందని రఘురామ స్పష్టం చేసేస్తున్నారు.
ఈ అయిదేళ్లుగా నిర్వహిస్తున్న రచ్చబండ ద్వారా.. జగన్ సర్కారు వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. రఘురామ చాలా టెక్నికల్ గా.. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే’ నింద తన మీదకు రాకుండా.. మా పార్టీ చాలా గొప్పది కానీ మా ముఖ్యమంత్రే దుర్మార్గుడు. మా పార్టీ చాలా గొప్ప విధానాలనే ప్రకటించింది.. మా ప్రభుత్వమే ప్రజలకు ద్రోహం చేస్తోంది లాంటి మెలిక మాటలతో చెలరేగుతేూ వచ్చారు.
ఆయన మీద రకరకాల కేసులు పెట్టి.. ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు కూడా. అరెస్టు చేసిన తర్వాత.. పోలీసులు తనను తీవ్రంగా హింసించారని, చంపడానికి ప్రయత్నించారని, సీఎం జగన్ తనను చంపడానికి పోలీసు గూండాలను ప్రయోగించారని కూడా రఘురామ ఆరోపించారు. ఇలా జగన్ సర్కారు ఆయనను ముప్పతిప్పలు పెట్టినప్పటికీ సహించారు. ఆయనమీద అనర్హత వేటు వేయించడానికి ప్రయత్నించినా వైసీపీ సఫలం కాలేకపోయింది. ఇన్ని పరిణామాల మధ్య తాజాగా తెలుగుదేశంలో చేరిన రఘురామ.. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే బరిలోకి దిగే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.