ఏపీ లో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వంగలపూడి అనితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇంటి వద్దకే వచ్చి పెంచిన మొత్తం పెన్షన్లను అందజేయడంతో ఏపీలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పెన్షన్ల పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పింఛనుదారులకు స్వయంగా ఆయన పెన్షన్ అందజేశారు.
ఇక పింఛన్ పంపిణీపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “ఈరోజు అవ్వాతాతల కళ్లల్లో నేను చూసిన ఆనందం, చిరునవ్వు నా జీవితాంతం గుర్తుంటుంది. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య ఉన్న తేడా ఈరోజు ప్రజలకు అర్థమైంది. మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు.. విడతల వారీ డ్రామాలు లేవు.. అడ్డమైన నిబంధనలు అసలే లేవు.. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్ రూ.4 వేలు చేశారు చంద్రన్న. అరియర్స్ తో కలిపి రూ.7 వేల పెన్షన్ ఇంటి వద్దనే అందజేసారు” అని లోకేశ్ ట్వీటర్లో పేర్కొన్నారు.