ఆయన నోటాదూకుడు, వాచాలత్వం మీద ఏకంగా డీజీపీకే ఫిర్యాదు అందింది గానీ.. ఇంకా కనీసం కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయంలో తన సంజాయిషీ చెప్పాలని పోలీసులు ఆయనకు నోటీసు ఇవ్వడం కూడా జరగలేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో సకల శాఖల మంత్రిగా పనిచేసిన సజ్జల రామక్రిష్ణారెడ్డి మాత్రం అరెస్టు భయంతో వణికిపోతున్నారు. ముందస్తు బెయిలు కోసం ఆయన ఏకంగా హైకోర్టును ఆశ్రయించి.. లేని కేసులో తనకు బెయిలు కావాలని అభ్యర్థిస్తున్నారు. అసలు ఈ వ్యవహారంలో కేసు పెట్టే అవకాశం ఉందా లేదా అని హైకోర్టు అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. అమరావతి ప్రాంత ప్రజలను, ప్రధానంగా మహిళలను ‘సంకరజాతి మనుషులుగా’ అభివర్ణించిన పాపం.. ఇప్పుడు సజ్జలను భయంలోకి నెడుతోంది.
వివరాల్లోకి వెళితే.. సాక్షి టీవీచానెల్లో నిర్వహించే కేఎస్సార్ లైవ్ షోలో జర్నలిస్టు కృష్ణం రాజు ద్వారా.. అమరావతి మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ తిట్టించిన వ్యవహారం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అమరావతి అనేది దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ కృష్ణం రాజు ఆ డిబేట్ లో నోరు పారేసుకున్నారు. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా.. వెకిలినవ్వులతో ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూనే, అలాఅంటే ట్రోల్ చేస్తారేమో అంటూ కృష్ణంరాజుపై తన సానుభూతి చూపించారు. కానీ.. రాష్ట్రం ఆ వ్యాఖ్యలపట్ల అట్టుడికిపోయింది. ప్రత్యేకించి అమరావతి ప్రాంత మహిళలు వైసీపీ మీద, సాక్షి చానెల్ మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఉద్యమాలు చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున.. సాక్షి ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకోడానికి మీడియా ముందుకు వచ్చిన ఈ మాజీ జర్నలిస్టు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. అమరావతిలో పోరాటం చేస్తున్న వారంతా సంకరజాతి మనుషులు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపట్ల కూడా తీవ్రమైన దుమారం రేగింది. డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణం రాజు ఏకంగా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సజ్జల మీద కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటిదాకా కేసు నమోదు కాకపోయినప్పటికీ.. ఏ క్షణమైనా తనను ఉన్నపళంగా అరెస్టు చేస్తారని సజ్జలకు భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అసలు కేసేలేకుండా, ముందస్తు బెయిలు పిటిషన్ వేయడానికే అర్హత లేదని.. ఈ కేసుకు విచారణార్హత లేదని పీపీ వాదనలు వినిపించారు. అయితే ఈ విషయంలో కేసు నమోదు చేస్తున్నారా? లేదా? తెలియజేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
తమను అవమానకరంగా మాట్లాడిన వారి గురించి నిరసనలు తెలియజేస్తున్న ప్రజల గురించి.. ఇలా సంకరజాతి అని వ్యాఖ్యానిస్తూ వాచాలత్వం ప్రదర్శించినప్పుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే.. ఇవాళ ఎలాంటి ఇబ్బందులు వచ్చి ఉండేవి కాదని జనం వ్యాఖ్యానిస్తున్నారు. మితిమీరిన అహంకారంతో కూడిన నోటిదూకుడు కారణంగానే ఆయన ఇప్పుడు కేసుల భయంతో బెయిల్ పిటిషన్లు వేసుకోవాల్సి వచ్చిందంటున్నారు.