జగన్ మోహన్ రెడ్డి వైభవోపేతమైన జీవన శైలి నెమ్మదిగా రూపు మార్చుకుంటోంది. అధికారంలో ఉన్నన్నాళ్లు ఆయన రాజభోగాలను ఎలాగైతే అనుభవించారో అందరికీ తెలుసు. ప్రజలు ఓడించిన తరువాత.. ఇప్పుడిప్పుడే ఆయన సామాన్యుల్లాగా బతకడం నేర్చుకుంటున్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లాలన్నా సరే.. ప్రత్యేక విమానం తప్ప మరొకటి ఎక్కేవారు కాదు. అలాంటిది.. అయిదేళ్ల తర్వాత తొలిసారిగా బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన ఇతర ప్రయాణికులతో కలిసి ఇండిగో విమానంలో వచ్చారు.
జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన వైభవం అనూహ్యమైనది. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లాలన్నా కూడా ఆయన హెలికాప్టర్ లో మాత్రమే వెళ్లేవారు. తాడేపల్లి నుంచి కడప వెళ్లాలంటే కూడా ప్రత్యేక విమానం మాత్రమే ఎక్కేవారు. ఈ స్థాయిలో ఆయన వైభవం పరిఢవిల్లింది. ఆయన అధిరోహించే ప్రత్యేక విమానాలే.. ఎంత విలాసవంతంగా ఖరీదుగా ఉంటాయో తెలియజెప్పే ప్రత్యేక కథనాలు కూడా మీడియాలో అనేకం వచ్చాయి. జగన్ అయిదేళ్లలో కేవలం ప్రత్యేక విమానాల కోసం పెట్టిన ఖర్చు మొత్తం గణిస్తే వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
నిజానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ముందు ఇంకా చాలా సింపుల్ లైఫ్ గడిపేవారు. హైదరాబాదు లోటస్ పాండ్ లో నివాసం ఉండే ఆయన తరచూ కడప లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. ఎక్కువగా రైలు ఎక్కేవాళ్లు. ప్రతి స్టేషన్లోనూ తలుపు దాకా వచ్చి అక్కడ గుమికూడే వందల మంది పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసి.. ఒకటిరెండు మాటలు మాట్లాడి వెళ్లేవారు.
అంత సింప్లిసిటీ నుంచి సీఎంగానే జగన్ ఒక్కసారిగా టాప్ గేర్ వేసేశారు. అన్నీ ప్రత్యేక విమానాలే. తీరా ఓడిపోయిన తర్వాత.. బెంగుళూరు నుంచి గన్నవరంకు సాధారణ పౌరవిమానంలో రావడం విశేషం.
నెమ్మదిగా జగన్ పాత బాటలోకి వెళ్తారని.. రైలు ప్రయాణాలు కూడా చేస్తారని, ప్రజలతో మమేకం కావడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం పోయిన వెంటనే.. ఇలా వైభవం మొత్తం హరించుకుపోవడం పట్ల మాత్రం జనం నవ్వుకుంటున్నారు.