నో బెయిల్ : దాడులు చేసే మూకలకు షాక్!

అధికారం తమ చేతిలో ఉన్నది కదాని.. దుహంకారంతో ఎగబడి దాడులు చేసేసి, తీరా అధికారం చేతులు మారిన తర్వాత.. బెయిలు తెచ్చుకుని.. యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాం అంటే కుదరదని హైకోర్టు స్పష్టమైన సంకేతాలు ఇచచింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులో కూడా ముందస్తు బెయిలుకు హైకోర్టు నో చెప్పింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే వరకు అరెస్టు జరగరాదని హైకోర్టు ఇస్తే తప్ప.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు అరదండాలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. 

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు అప్పటి ముఖ్యమంత్రిని దుర్భాషలాడారనే నెపంతో.. వైసీపీ నాయకులు చంద్రబాబు నివాసం, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీదికి దాడికి తెగబడ్డారు. వందల మంది కలిసి దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. తమ అనుచర మూకలందరినీ దాడులకు ఉసిగొల్పడం ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ తదితరులు నిందితులు. కేవలం బాగా దాడిచేసినందుకే, చేయించినందుకే జోగి రమేష్ ను జగన్ ఆత్మీయుడుగా భావించి ఆ తర్వాత మంత్రి పదవి కూడా కట్టబెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లోనే ఈ దాడులకు సంబంధించి తెలుగుదేశం నాయకులు కేసులు పెట్టినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. 

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసులు తిరిగి విచారణ ప్రారంభించారు. కొందరి అరెస్టులు కూడా జరిగాయి. దాడులకు పాల్పడిన కీలక నాయకులకు నోటీసులు కూడా ఇచ్చారు. విచారణకు పిలిచిప్పుడెల్లా హాజరవుతామని కోర్టునుంచి అనుమతి తెచ్చుకున్న నాయకులు.. ఆ విషయంలో రకరకాలుగా ప్రవర్తిస్తూ వచ్చారు. మరోవైపు ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ నడిపారు. తాజాగా ముందస్తు బెయిలు సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పేసింది. 

ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఉన్నదని, సుప్రీంలో అప్పీలు చేసుకునేందుకు అనుమతివ్వాలని, అప్పటిదాకా అరెస్టులు జరగకుండా నిలువరించాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. కానీ.. మొత్తానికి ముందస్తు బెయిలు తిరస్కరించడం ద్వారా.. హైకోర్టు వైసీపీ నేతలకు పెద్ద షాకే ఇచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories