రాష్ట్రంలోని అన్నదాతలు చంద్రబాబు ప్రభుత్వానికి నీరాజనం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు న్యాయంగా దక్కవలసిన సొమ్ము కూడా ఇవ్వకుండా వంచిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా నిధులు విడుదల చేసి తమను ఆదుకోవడంపై సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. తమ ధాన్యం కొనుక్కుని, ప్రభుత్వమే సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేస్తోంటే రైతులు దిక్కు తెలియక ఇన్నాళ్లూ గొల్లుమంటూ ఉండిపోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే అన్నదాతలకు రావాల్సిన బకాయిలు మొత్తం విడుదల చేసేస్తోంది. ఇంత చురుగ్గా.. అన్నదాతలను ఆదుకునే చర్యలు చేపట్టడం పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
గత రబీలో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సారథ్యంలోని జగన్ ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసింది. వాటి చెల్లింపు గురించి అస్సలు పట్టించుకోలేదు. మొత్తం 84,724 మంది రైతులు జగన్ సర్కారు చేసిన ద్రోహం వల్ల దాదాపుగా రోడ్డున పడ్డారు. అమ్మిన ధాన్యానికి డబ్బులివ్వకుండా ప్రభుత్వమే మోసం చేయడంతో వారంతా ఆక్రోశించారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. రైతుల కష్టాలను గమనించింది. జులై నెలలో 49,350 మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. మిగిలిన 35,374 మంది రైతులకు 674 కోట్ల బకాయిలను తాజాగా నాదెండ్ల మనోహర్ విడుదల చేయబోతున్నారు. ఏలూరు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్ రైతులకు చెక్కులు అందజేయబోతున్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనే సంగతిని తమ చర్యలతో నిరూపించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి అన్నదాతలు నీరాజనం పడుతున్నారు.
పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందునుంచి కూడా రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నారు. ఎప్పటినుంచో ఆయన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు సొంత డబ్బు ఆర్థికసాయం అందిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రైతుల కష్టాలు తీరుతుండడం గమనార్హం.