తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన అనేక అంశాల్లో సూపర్ సిక్స్ హామీలు కూడా ప్రధానమైనవి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం గద్దెఎక్కి నాలుగు నెలలు కూడా గడవక ముందే.. సూపర్ సిక్స్ హామీలు ఏవీ ఎక్కడ? అని పదేపదే అడగడం ద్వారా.. ప్రతిపక్షాలు తమ భయాన్ని చాటుకున్నాయి. ఇప్పుడు చంద్రబాబునాయుడు దీపావళి పర్వదినం సందర్శంగా దీపం 2 పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి.. సూపర్ సిక్స్ కు ఘనమైన శ్రీకారం చుట్టారు. అలాగే ఈ ఆరింటిలో మరో సిక్సర్ లాంటి ఇంకో హామీ కూడా త్వరలోనే అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రకటించడం విశేషం.
తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎన్నికలకు ఏడాది ముందే సూపర్ గా క్లిక్ అయ్యాయి. బాగా ప్రజల్లోకి వెళ్లాయి. ఎంతగా ప్రజాదరణ పొందాయంటే.. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ జడుసుకుని.. వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వచ్చింది. సూపర్ సిక్స్ హామీలు ఏవీ నెరవేరవని, వాటిని నెరవేర్చడానికి సరిపడా ఆర్థిక వనరులు రాష్ట్రానికి లేవని, చంద్రబాబునాయుడు అబద్ధాలు చెబుతున్నారని రకరకాలుగా వారు ప్రచారం చేశారు. జగన్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు చంద్రబాబును నమ్మారు. ఆయనకే అధికారం కట్టబెట్టారు. సూపర్ సిక్స్ ను నెరవేర్చే బాధ్యత ఆయనమీదే పెట్టారు. ఈ ఎన్నికల విజయంలో సూపర్ సిక్స్హ్ హామీలు అనేవి.. ఆరు సిక్సర్ల లాంటివి అనే చెప్పాలి.
పాలనను ఎంతగా రంజింపజేయాలని అనుకున్నప్పటికీ.. ఆరు సిక్సర్లను ఒకే ఓవర్లో కొట్టేయడానికి ఇదేమీ టీ20 మ్యాచ్ కానే కాదు. అయిదేళ్లపాటు సుదీర్ఘ ఇన్నింగ్స్ సాగవలసిన మ్యాచ్. బలమైన ఇన్నింగ్స్ కు పునాది వేసేలాగానే.. తగిన సమయంలో అదను చూసి ఒక్కో సిక్సర్ ను సంధించాలి. అయినా సరే.. జగన్ దళాలు ఆవేశపడిపోతూ.. ఇంకా అమలు చేయలేదు అంటూ చాలా గోల చేశారు. ఆ ఆరు హామీల్లోమొదటగా చంద్రబాబునాయుడు ఇప్పుడు దీపం పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చారు.
దీని తర్వాత.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే హామీ కార్యరూపంలోకి రాబోతున్నది. ఆ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. నిజానికి మహిళలకు ఆశగా ఎదురుచూస్తున్న హామీల్లో అది కూడా ఒకటి. అలా వరుసక్రమంలో ఆరు హామీలు కూడా కార్యరూపంలోకి వస్తే బురదచల్లే పనిలో బతుకుతున్న వైసీపీకి నోట మాట రాదని పలువురు అంటున్నారు.