అభివృద్ధి పనులపై సంకుచిత విషప్రచారం!

తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అనే చవకబారు నీతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసినంతగా బహుశా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. తిరుమల వేంకటేశ్వర స్వామివారి సొమ్మును అడ్డగోలుగా కాజేయడానికి వారు భారీ వ్యూహాన్నే రచించారు. తీరా ఇప్పుడు శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తొలగించేలా కొన్ని రోడ్ల పనులు చేపట్టడానికి టీటీడీ నిధులను కేటాయించే ప్రయత్నం చేస్తోంటే.. దేవుడి నిధులు కాజేస్తున్నట్టుగా గోలగోల చేస్తున్నారు. రెండు నాలుకల ధోరణిమాత్రమే కాదు.. రెండు విధాల కుట్రబుద్ధులతో వ్యవహరించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి కరపత్రికకు మాత్రమే చెల్లిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి సమీపంలో ప్రవహించే సువర్ణముఖి నదిపై కొన్ని కాజ్ వేలు 2021లో వచ్చిన తుపాను వల్ల దెబ్బతిన్నాయి. అప్పటి జగన్ సర్కారు చాలా సహజంగా వీటిలో ఏ ఒక్కదాని మరమ్మతుల గురించి కూడా పట్టించుకోలేదు. నదిపై కొన్నిచోట్ల కాజ్‌వేల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రబాబును కోరడంతో, వాటికి నిధులు ఇవ్వాలంటూ టీటీడీకి ప్రభుత్వం సూచించడం జరిగింది. అక్కడికేదో చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు టీటీడీ నిధులు దోచిపెట్టేస్తున్నట్టుగా వైసీపీ దళాలు విషప్రచారం ప్రారంభించాయి.

టెక్నికల్‌గా చంద్రగిరి నియోజకవర్గం అనుకోవచ్చు గానీ.. ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుపతిలో భాగంగా విస్తరించి ఉన్నటువంటివే. అక్కడ ప్రస్తుతం ప్రతిపాదించిన కాజ్ వే నిర్మాణాలు వంటి పనులన్నీ తిరుమల వచ్చే భక్తుల సౌకర్యంతో ముడిపడినట్టివే. ఆయా ప్రాంతాల వరకు తిరుమల భక్తులకు సేవలందించే హోటళ్లు, ఇతర వ్యాపారాలు ఇప్పటికే విస్తరించి ఉండడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రగిరి ఎక్కడో వేరే చోట ఉన్నట్టుగా.. ఆ నియోజకవర్గంలో అభివృద్ధికి టీటీడీ డబ్బు పెడుతున్నారని, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు టీటీడీ డబ్బు తరలిస్తారని జగన్ కరపత్రిక అప్పుడే విషం చల్లడం ప్రారంభించింది.

ఇప్పటికీ తిరుపతి నగరం, పరిసరాల్లో అనేక పనులు, పారిశుధ్య నిర్వహణతో సహా టీటీడీ నిధులు వెచ్చిస్తుంటారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధి.. తిరుపతితో హద్దులు గుర్తించలేనంతగా కలిసిపోయి ఉంటుంది. జగన్ సర్కారుకు దేవుడు సొమ్ము అప్పనంగా దోచుకోవడం అలవాటు అయింది. టీటీడీ చైర్మన్ గా భూమనను పెట్టి.. ఆయన కొడుకుకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. తండ్రి టీటీడీ నుంచి దోచి పెట్టిన డబ్బుతో కొడుకుకు ఓట్లు పడేలా చేసుకోవాలని అప్పట్లో కుట్రలు చేశారు. భూమన ఏకంగా టీటీడీ బడ్జెట్ లో ఏటా వంద కోట్లు ప్రభుత్వానికి ముట్టజెప్పేలా తీర్మానించి జగన్ రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు. పెద్దస్థాయిలో విమర్శలు రావడంతో తర్వాత జగన్ దళం వెనక్కు తగ్గింది. ఇప్పుడు.. తిరుమల స్వామివారి భక్తులతో ముడిపడిన పనులకు కొంత మేర టీటీడీ డబ్బులు పెట్టమంటేనే దానిపై వైసీపీ విషం కక్కడం హేయంగా ఉన్నదని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories