పవన్ ధైర్యం, చిత్తశుద్ధికి నారాయణ కితాబులు!

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించడం, అక్కడే బస చేయడం, అక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం తదితర వ్యవహారాలకు సంబంధించి.. ఆయనలోని ధైర్యానికి, చిత్తశుద్ధికి బహుధా ప్రశంసలు దక్కుతున్నాయి. చింతపల్లి ప్రాంతంలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో పర్యటించరు అని, రాత్రి పూట అక్కడే బస చేయడం అనేది అనూహ్యం అని.. అలాంటిది డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడ బస చేయడం ప్రజలతో మమేకం కావడం కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని నారాయణ కితాబులు ఇస్తున్నారు.

చింతపల్లి ప్రాంతం మన్యం గ్రామాలు, అటవీ ప్రాంతాలలో తిరగాలంటే రాజకీయ నాయకులు భయపడుతుంటారు. అక్కడి ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యేను కూడా కలిపి గతంలో మావోయిస్టులు కాల్చి చంపారు. వారు కాల్చి చంపిన ప్రాంతంలోనే పవన్ కల్యాణ్ ఇటీవల రెండు రోజుల పాటు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దాని గురించే ఇప్పుడు నారాయణ ప్రశంసిస్తున్నారు. తాను తప్ప.. మన్యం ప్రాంతంలో పర్యటించిన, బసచేసిన నాయకుడు మరొకరు లేరని.. తాను గతంలో చింతపల్లి నియోజకవర్గం పరిధిలో పదిరోజులు పాదయాత్ర  నిర్వహించానని అన్నారు. అందుకే పవన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వం మన్యం జిల్లా మారుమూల ప్రాంతాలకు కూడా రోడ్డు సదుపాయం కల్పిస్తుండడాన్ని నారాయణ కొనియాడారు. గతంలో అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు రోడ్లు నిర్మించాలనుకుంటే నక్సలైట్లు అడ్డుపడేవారని, రోడ్ల నిర్మాణాన్ని అంగీకరించేవారు కాదని ఆయన అన్నారు. పక్కా రోడ్లు ఏర్పడితే.. పోలీసులు సులభంగా అటవీ మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకు వచ్చేస్తారని, అది తమకు ప్రమాదకరం అని వారు భయపడేవారని చెప్పారు. కానీ అది కరెక్టు కాదు.. అభివృద్ధి కూడా కావాలి కదా.. రోడ్ల నిర్మాణానికి పూనుకోవడం చాలా మంచిది అని చెప్పారు.

మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటనలో పోలీసులను బట్టలూడదీసి కొడతానని అనడాన్ని నారాయణ గర్హించారు. ఇది తప్పు అని.. పోలీసులు కేవలం ప్రభుత్వం ఎలా చెబితే అలా చేసేవాళ్లు మాత్రమేనని, జగన్ కు ధైర్యముంటే ప్రభుత్వాన్ని నిందించాలి తప్ప పోలీసుల్ని కాదని ఆయన హితవు చెప్పారు. అదే సమయంలో మోడీ, అమిత్ షా లను ప్రసన్నం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తమలపాకుతో మంత్రించినట్టుగా వారిని నొప్పించని విధంగా విమర్శలు చేస్తూ.. పన్నెండేళ్లు బెయిలుపై బయట తిరుగుతున్న ఏకైక నేతగా మిగిలారని నారాయణ ఎద్దేవా చేశారు. ఒకవైపు పవన్ ఆలయాలు తిరిగినప్పుడు.. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామక్రిష్ణ తీవ్రంగా విమర్శించగా, మరోవైపు మన్యం పల్లెలు తిరిగినప్పుడు నారాయణ కితాబులివ్వడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories