కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయా సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రారంభించేలా చేయడానికి ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. దేశవిదేశాల్లో తిరుగుతూ.. పెద్ద సంస్థలను కలుస్తూ.. వారికి ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తూ వారిని రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. మరొకవైపు వైసీపీ నాయకులు మాత్రం సైంధవుల్లాగా రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు. సంస్థలను బెదిరించడానికి తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. తాజాగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్రలు చేసే ఇలాంటి సైంధవులకు మంత్రి నారా లోకేష్ ఒక స్ట్రాంగు హెచ్చరిక జారీచేశారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం తీసుకువస్తున్న పరిశ్రమలను అడ్డుకునే దుర్మార్గుల పేర్లను రెడ్ బుక్ లోకి ఎక్కిస్తామంటూ నారా లోకేష్ హెచ్చరిస్తున్నారు.
రెడ్ బుక్ అనే పదం వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వణుకు పుడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాజ్యాంగమూ, చట్టమూ అనే పదాలకైనా వారు భయపడతారో లేదో గానీ.. రెడ్ బుక్ లో తమ పేరు ఉన్నదంటే తమ అంతు తేలుస్తారనే ఆందోళనలో గడుపుతున్నారు. రెడ్ బుక్ అనేది అసలు ఉన్నదో లేదో తెలియదు. కానీ, ఆ పదాన్ని తప్పుడు పనులు చేసేవారి గుండెల్లో సింహస్వప్నంలాగా మార్చేశారు నారా లోకేష్.
కూటమి సర్కారు ఏర్పడిన తరువాత.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు పనులకు సంబంధించి.. పక్కాగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే.. ఎవ్వరిమీదనైనా కేసులు నమోదు చేయడమూ, విచారించడమూ జరుగుతోంది. మరోరకంగా ఆ కేసుల్ని ఎదుర్కోవడం, తాము పరిశుద్ధులుగా తేలడం చేతకాని వైసీపీ నాయకులు రెడ్ బుక్ మీద పడి ఏడుస్తుండడం కూడా జరుగుతోంది. అదే సమయంలో.. నారా లోకేష్ కూడా.. ఇంకా రెడ్ బుక్ ప్రస్తావనే చేస్తూ.. తప్పుడు పనులు కొనసాగించే వారి పేర్లను అందులోకి ఎక్కిస్తానంటూ హెచ్చరిస్తున్నారు.
ప్రకాశం జిల్లా రిలయన్స్ సీబీజీ ప్లాంటుకు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత అయిదేళ్ల కాలంలో.. రాష్ట్రం నుంచి అనేక సంస్థలను ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టిన వైసీపీ పాలన గురించి ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్లును తీసుకువస్తే.. గత ప్రభుత్వం రానివ్వలేదంటూ.. గుర్తుచేశారు. ఇప్పుడు కూడా వివిధ కంపెనీలను తమ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగా.. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు వెనక్కు లాక్కుంటాం అనే ప్రకటనలు చేయడం, భరతం పడతాం అని హెచ్చరించడం, రాదలచుకున్న సంస్థలకు బెదిరింపు లేఖలు రాయడం వంటి చర్యల ద్వారా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని లోకేష్ ప్రస్తావించారు. ఉపాధులు కల్పించే సంస్థలను ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వారి పేరు రెడ్ బుక్ లోకి ఎక్కిస్తాం అంటున్నారు. చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం అనే హెచ్చరికలను పట్టించుకోకుండా, జడత్వం పెంచేసుకున్న వైసీపీ నాయకులు రెడ్ బుక్ అంటే మాత్రం జడుస్తున్నారని జనం అనుకుంటున్నారు.