పరిపాలనలో ఆధునిక సాంకేతిక పోకడలను, విప్లవాత్మక ధోరణiలను తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్- తన తండ్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంత మాత్రమూ తీసిపోనని నిరూపించుకుంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తండ్రి చంద్రబాబు సాంకేతిక విప్లవాన్ని ప్రజా పరిపాలనకు ఒక ఆయుధంగా జోడించి ‘హైటెక్ ముఖ్యమంత్రి’గా కొన్ని దశాబ్దాల కిందటే కీర్తి గడించారు. ఇప్పుడు నారా లోకేష్ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సరికొత్త టెక్నాలజీని ప్రజలకు సేవలు అందించడానికి వినియోగిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రజలకు నిత్యం అవసరం అయ్యే దాదాపు 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించేలా కొత్త పద్ధతికి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ గురువారం శ్రీకారం దిద్దుకుంది. మంత్రి నారా లోకేష్ దీనిని ప్రారంభించారు. ఈమేరకు గత సెప్టెంబరులోనే మెటా సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటినుంచి అనేక రకాల కసరత్తులు, పరిశీలనల తర్వాత గురువారం ప్రారంభించారు. ‘మన మిత్ర’ పేరుతో ఈ వాట్సప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. దీనికోసం అధికారికంగా ఒక నెంబరును కేటాయించారు. ఈ నెంబరు 95523 00009. ఈ వాట్సప్ నెంబరు ద్వారా.. కేవలం ప్రజలకు ప్రభుత్వ విభాగాల ద్వారా అందవలసిన సేవలు అందించడం మాత్రమే కాదు.. వారు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించేందుకు, ప్రభుత్వంనుంచి అవసరమైన సమచారాన్ని అడిగి పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే.. గవర్నమెంటు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని వాట్సప్ లో మెసేజీ పెడితే చాలు.. నిర్ణీత వ్యవధిలో సర్టిఫికెట్ వచ్చేస్తుందని లోకేష్ చెప్పారు. ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకోవడం దగ్గరినుంచి, ఏపీలో పర్యాటక ప్రదేశాలను టూర్ చేయడానికి అక్కడ టికెట్లు బుక్ చేసుకోవడం, గదులు బుక్ చేసుకోవడం వంటివన్నీ వాట్సప్ ద్వారానే చేయవచ్చు.
ఈ వాట్పప్ గవర్నెన్స్ ఆలోచన కూడా నారా లోకేష్ దే అని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఆయనకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతానికి 161 సేవలు అందిస్తుండగా.. వాటిని 520 సేవల వరకు విస్తరించేలా ప్రణాళికతో పనిచేస్తున్నారు. ఇవన్నీ ఉచితంగానే అందిస్తున్నారు.
అన్నింటికంటె గొప్పవిషయం ఏంటంటే.. ఈ తరహాలో ప్రజలకు సులువైన రీతిలో పౌరసేవలు అందించే ఏర్పాటు ప్రపంచంలోనే ప్రప్రథమం అని లోకేష్ వెల్లడించారు. అయితే తాము కూడా ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాం అని సవినయంగా చెప్పుకున్నారు. కొత్త పద్ధతి గనుక.. ఈ పద్ధతిని రూపొందింస్తూనే తాము కూడా నేర్చుకుంటున్నాం అని లోకేష్ అన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా. వాటిని దిద్దుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు. ప్రజలు వాడడం ప్రారంభించిన తర్వాత.. లోడ్ ను బట్టి సర్వర్ సమస్యలు తలెత్తకుండా కెపాసిటీ పెంచే మార్గాలు చూస్తామని ఆయన అంటున్నారు. మొత్తానికి ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా.. ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. ప్రపంచ చరిత్రలోనే ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టింది.