లోకేష్.. ఎక్కడ అడుగుపెట్టినా రాష్ట్రం గురించే

వేసే ప్రతి అడుగులో.. చేసే ప్రతి పనిలో ఒకే ఒక నిర్దిష్టమైన ఎజెండాతో ముందుకు వెళుతుండాలనే పట్టుదల చాలా తక్కవ మందిలో ఉంటుంది. అలాంటి వారి సారథ్యం ఖచ్చితంగా ఆయా ప్రయోజనాలను సాధించడంలో ఉపయోగపడుతుంది. ఏపీ మంత్రి  నారా లోకేష్ వ్యవహార సరళి ఇప్పుడు ఇదేవిధంగా కనిపిస్తోంది. పెట్టుబడుల కోసం, పారిశ్రామికవేత్తలతో భేటీల కోసం, అంతర్జాతీయ బిజినెస్ మీట్ల కోసం వెళ్లినప్పుడు.. పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల గురించే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులను, సంస్థలను తీసుకురావడం ఒక్కటే లక్ష్యంగా ప్రవర్తించడం ఎలాగూ మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ.. నారా లోకేష్ తాను ఏ పని మీద ఎక్కడకు వెళ్లినా.. ‘మన రాష్ట్రం కోసం అక్కడినుంచి ఏం సాధించుకు వస్తున్నాం?’ అనేది ఒక్కటే తన ఎజెండాగా బతుకుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. చివరికి ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్లినా కూడా ఇదే పరిస్థితి.

కర్ణాటక రాష్ట్రం మండ్య జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం ఉంది. 1800 ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం ఇది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నారా లోకేష్ ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అక్కడి కాలభైరవస్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆ మఠం కేవలం ఆధ్యాత్మిక ధర్మ ప్రచారంలో మాత్రమే కాదు.. సామాజిక సేవలో కూడా చురుగ్గా ఉంటుంది. మఠం ఆధ్వర్యంలో పాఠశాలలు, మెడికల్ కాలేజీ, ఆసుపత్రి,యూనివర్సిటీలను కూడా నిర్వహిస్తుంటారు. లోకేష్ అక్కడి మఠాన్ని సందర్శించి, వారు నిర్వహిస్తున్న సంస్థలు, మఠం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అన్నింటి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

ఆదిచుంచనగిరి మఠం వారి ఆధ్వర్యంలో సంవిత్ పాఠశాలలను నిర్వహిస్తుంటారు. ఈ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో విద్యాబోధన ఉంటుంది. ఇంటర్ పూర్తయిన తర్వాత.. ఏ రాష్ట్రంలో ఏ డిగ్రీ చేయదలచుకున్నప్పటికీ.. వారికి మఠం ఆర్థిక సహాయం అందిస్తుంది.

నారా లోకేష్ ఈ పర్యటనలో మఠం 72వ పీఠధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామిని కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంవిత్ పాఠశాలలను మఠం ఆధ్వర్యంలో ప్రారంభించాలని ఆయన కోరారు. అందుకు పీఠాధిపతి కూడా ఆమోదం తెలియజేయడం విశేషం.
పేదలకు ఉచిత విద్య అందించే, వారు చదివినంత కాలమూ ఆర్థికంగా సాయం అందించే ఉన్నత ప్రమాణాలు గల పాఠశాల గురించి తెలియగానే.. అలాంటి ఉత్తమ ప్రమాణాలు గల పాఠశాల తమ రాష్ట్రంలో కూడా ఉండాలని కోరుకోవడం గమనార్హం. ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్లినా కూడా వారి సేవా పరిమళాలు మన రాష్ట్రానికి రావాలని, పేదలకు వారు అందించే సేవా సంస్థలు మన రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటూ నారాలోకేష్ సాగిస్తున్న ప్రయత్నాలు,  అతని దృక్పథం సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories