నందిగం సురేష్.. అప్రూవర్‌గా మారడానికి సిద్ధం!

తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంపై జరిగిన దాడి కేసులో కీలక నిందితుల్లో ఒకడు, మాజీ ఎంపీ, ప్రస్తుతం రిమాండులో ఉన్న నందిగం సురేష్ అప్రూవర్ గా మారబోతున్నారా? అప్పట్లో తెదేపా పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి విషయంలో అసలు సూత్రధారులు ఎవరు? పురమాయించింది, రెచ్చగొట్టింది ఎవరు? మార్గదర్శనం చేసింది ఎవరు? కేసులో నిందితులుగా ఉన్న ఇతర నాయకులు అందరిలోనూ ఎవరి పాత్ర ఎంత? వంటి సమస్త వివరాలు ఆయన పోలీసులకు పూసగుచ్చినట్టుగా చెప్పడానికి నిర్ణయించుకున్నారా? కొన్ని సంకేతాలను గమనించినప్పుడు, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అలాగే అనిపిస్తోంది.

నందిగం సురేష్ బాపట్ల ఎంపీగా పనిచేసిన ఎస్సీ నాయకుడు. తెలుగుదేశం ఆఫీసు మీద దాడిచేయడంలో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు. హైదరాబాదు శివార్లలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన తర్వాత, న్యాయమూర్తి ముందు హాజరుపెట్టినప్పుడు ఆయన న్యాయవాదులు.. దాడి జరిగినప్పుడు ఆయన అక్కడ లేనేలేరని వాదించే విఫలయత్నం కూడా చేశారు. అయితే సీసీ టీవీ ఫుటేజీల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొని న్యాయమూర్తి రిమాండు విధించారు. మిగిలిన నాయకులు ఇంకా పరారీలో ఉన్నారు. సుప్రీంలో అప్పీలు చేసుకుని అరెస్టునుంచి రక్షణ కల్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఆ ఇతర నాయకులందరూ కలిసి ఎస్సీ వర్గానికి చెందిన నందిగం సురేష్ ను వేరు చేశారని, పరారీలో, అజ్ఞాతంలో ఉంటూ తప్పించుకోవడానికి వారు చేసిన ప్లాన్ లో నందిగంకు భాగం లేకుండా చేశారని ఒక వాదన ఉంది. జోగిరమేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురాం తదితరులు ఒక ముఠాగా ప్లాన్ చేసుకోవడం వలన.. నందిగం పరిస్థితి వెలివేయబడినట్టు అయింది. ఆయన పోలీసులకు దొరికిపోయారనేది ఒక వాదన. సొంత పార్టీ నాయకులే ద్రోహం చేశారని, వారితో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అని నందిగంలో విరక్తి కలిగినట్టుగా చెబుతున్నారు.

అదే సమయంలో.. నందిగం సురేష్ అరెస్టు వల్ల ఉపయోగం లేదని, ఆయన వెనుక ఉండి నడిపించిన సజ్జల వంటి కీలక నాయకుల్ని అరెస్టు చేయాలని తెదేపా నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ కోరుతున్నారు. ఈ సంకేతాలను బట్టి పోలీసు విచారణలో నందిగం సురేష్ అప్రూవర్ గా మారి తెరవెనుక కీలక వ్యక్తుల పేర్లు చెబుతారని అనిపిస్తోంది. వైసీపీ ఎటూ తనను పట్టించుకోకుండా ద్రోహం చేసింది కాబట్టి.. కనీసం తన నిజాయితీ చూపించుకోవడానికి నిజం చెబుతారనే ప్రచారం జరుగుతోంది. మరి నందిగం సురేష్ ఏం చేస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories