పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సైఫై మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడమే కాకుండా, అద్భుతమైన విజువల్స్, భారీ స్టార్కాస్ట్ కారణంగా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
సినిమా రిలీజ్ సమయంలోనే దీని తర్వాత సీక్వెల్ కూడా వస్తుందని మేకర్స్ స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా, ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
ఆయన మాటల ప్రకారం, మొదట తన ప్లాన్ ప్రకారం 2025 చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారట. ఆ తర్వాత సినిమా గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం కనీసం ఒకటి రెండేళ్ల సమయం పడుతుందని భావించారు. అందుకే 2026 లేదా 2027లో రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసారని చెప్పారు.