పేటీఎం బ్యాచ్ అంటూ ఏపీ ప్రజలు ముద్దుగా పిలుచుకునే విషప్రచారపు సారథులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. అయిదేళ్ల పాటూ వాళ్లు ఎలాంటి విషాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయిస్తూ చెలరేగిపోయారో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడును బద్నాం చేస్తూ ఎన్నెన్ని అబద్ధాలను ప్రచారంలో పెట్టారో కూడా ప్రజలకు తెలుసు. పవన్ కల్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి ఏ వెకిలి వ్యాఖ్యలు చేసినా సరే.. వెంటనే వాటిని అందిపుచ్చుకుని.. చిలవలుగా పలవలుగా మరింతగా ఆ వెకిలితనానికి మసాలా జోడిస్తూ ప్రచారం చేయడంలో వైసీపీ పేటీఎం బ్యాచ్ చెలరేగిపోయేవారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ షాక్ లో ఒకటిరెండు రోజులు ఉండిపోయారు గానీ.. వెంటనే మళ్లీ తమ పని ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది. ఈసారి కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని.. మరీ లేకిగా కాకుండా.. కాస్త మాడరేట్ గా తమ తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. వాటిలో భాగంగానే.. పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు, తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమిస్తారంటూ ఒక వార్తను ప్రచారంలో పెట్టారు.
నాగబాబు పవన్ కల్యాణ్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ తరఫున రాష్ట్రమంతా పర్యటిస్తూ కార్యకర్తలను కట్టుగా ఉంచడంలో, వారికి స్ఫూర్తి ఇవ్వడంలో తరచూ సమావేశాలు నిర్వహించి కీలకంగా ఉండేవారు. పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త సభలకు తప్ప.. కార్యకర్తలతో చిన్నచిన్న సమావేశాలకు సమయం కేటాయించలేని స్థితిలో ఉండేవారు. అదే సమయంలో, పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ రాష్ట్రమంతా తిరుగుతూ నిర్వహించిన కార్యక్రమాలు వేరు. నాగబాబు మరో కోణంలో పార్టీ నిర్మాణానికి, పార్టీని బలోపేతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. అలాంటిది.. నాగబాబుకు ఎంపీ పదవి కట్టబెట్టాలని పవన్ అనుకున్నారు. ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేయించడానికి నిర్ణయించారు. అయితే బిజెపితో కలిసి పొత్తులు కుదిరిన తర్వాత.. ఆ స్థాని కమలదళానికి వెళ్లింది.
నాగబాబు మాత్రం అసంతృప్తికి గురికాకుండా తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం పిఠాపురంలో తిష్టవేసి.. అక్కడి వ్యవహారాలు మొత్తం చూసుకున్నారు. ఒకవైపు పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం నిర్వహిస్తోంటే.. పిఠాపురం ప్రచార పనులన్నీ నాగబాబు ఆధ్వర్యంలోనే నడిచాయి. ఆయనకు ప్రభుత్వంలో సముచితమైన స్థానం దక్కుతుందనేది గ్యారంటీ.
అయితే ఈ లోగానే పేటీఎం బ్యాచ్.. నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. దీనిని ఖండిస్తూ నాగబాబు చివరికి స్వయంగా ఈ ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని, ఇవన్నీ కేవలం పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలేనని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. ‘అసత్య ప్రచారాలను నమ్మకండి, ప్రచారం చేయకండి. పార్టీ అధికారిక, నా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి’ అని ఆయన పేర్కొన్నారు.