నాదెండ్ల సూచన భేష్ : ఆటో డ్రైవర్లకు అండగా సర్కార్!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రాబోతోంది. మహిళలు ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం.. మహిళలు తమ తమ సొంత జిల్లాల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామనం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ…ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకానికి స్త్రీశక్తి అని పేరు కూడా పెట్టారు. ఈ పథకం వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలగబోతోంది. అయితే రాష్ట్రంలో లక్షల మంది మహిళలకు ప్రతిరోజూ ఉచిత బస్సు ప్రయాణం అందివస్తే.. నష్టపోయే వర్గం మాటేమిటి? ఈ దిశగా కూడా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ దిశగా అద్భుతమైన సూచన చేశారు.

స్త్రీశక్తి పథకం వలన ఆటో డ్రైవర్లకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఏకపక్షంగా ఆటోల వ్యాపారం పూర్తిగా పడిపోతుందని అనడం కరెక్టు కాదు గానీ.. వారి వ్యాపారం చాలా వరకు దెబ్బతింటుంది. కొన్నాళ్లకు మళ్లీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న ఇతర ప్రాంతాల్లో ఈ విషయం ఇప్పటికే నిర్ధరణ అయింది. తెలంగాణ వంటి చోట్ల ఆటోలన్నీ తిరిగి ఎప్పటిలాగా నడుస్తున్నాయి. ఈ విషయంలో ఏపీలోని ఆటో డ్రైవర్లకు భరోసా కల్పించాలని సర్కారు అనుకుంటోంది.

కేబినెట్ భేటీ తర్వాత.. అనేక అంశాలు చర్చకు వచ్చినప్పుడు.. స్త్రీశక్తి పథకం అమలు కాబోతున్న ఆగస్టు 15కంటె ముందే.. ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడితే బాగుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. దీనివల్ల ఆ వర్గంలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉంటుందని ఆయన అన్నారు. నాదెండ్ల చాలా మంచి సూచన చేశారంటూ కితాబిచ్చిన చంద్రబాబునాయుడు, సంబంధిత అధికారులు ఆటో డ్రైవర్లతో మాట్లాడాలని చెప్పారు.
ఇప్పటికే.. ఆటోడ్రైవర్లు అందరికీ రూ.పదివేలవంతున ప్రభుత్వం అందించబోతున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగానూ అందరి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు స్త్రీశక్తి పథకం ద్వారా 8వేల పైచిలుకు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణావకాశం కల్పిస్తూ.. మరో వైపు దానివలన ఎవ్వరికీ, ఆటోడ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా..  వారికి ఆర్థిక చేయూత కూడా అందిస్తుండడం గొప్ప విషయం అని అందరూ భావిస్తున్నారు. స్త్రీశక్తి పథకం రాష్ట్రంలోని మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడానికి, వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories