వైసీపీని ఖాళీ చేయించే పనిలో మామయ్య

ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడిగా పార్టీ కోసం కష్టపడిన మామయ్య ఇప్పుడు తన సొంత జిల్లాలో ఆ పార్టీని ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎదురైన అవమానాలు చేదు అనుభవాలను తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసిన ఈ వైఎస్ఆర్ భక్తుడు.. ఇప్పుడు తన సొంత జిల్లాలో పార్టీని మొత్తం ఖాళీ చేయించాలని అనుకుంటున్నారు. 26వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోతున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో వైసిపి కార్యకర్తలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే ఒకప్పట్లో ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక పెద్దదిక్కుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద జిల్లా రాజకీయాలకు సంబంధించి ఆయన మాట వేదంగా చెల్లుబాటు అయ్యేది. ఆ తర్వాత జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి ప్రాబల్యం కూడా పార్టీలో విపరీతంగా పెరగడంతో పాటు, వైవీతో బాలినేనికి ఉన్న విభేదాల కారణంగా ఆయన తన సొంత నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చింది.

2019లో బాలినేని గెలిచి మంత్రి అయ్యారు. కానీ మూడేళ్ల తర్వాత జగన్ మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అంటూ ఒక ప్రహసనం నడిపించినప్పుడు.. చాలా మంది మంత్రులను కొనసాగిస్తూ బాలినేనిని మాత్రం తొలగించారు. అప్పట్లోనే ఆయన దానిని అతిపెద్ద అవమానంగా భావించారు. పార్టీకి చురుకు పుట్టేలా అనేక వ్యాఖ్యలు చేశారు కూడా. అప్పటినుంచి బాలినేని ప్రాధాన్యానికి నెమ్మదిగా పార్టీలో కోతపడుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో ఎంపి టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇప్పించడానికి బాలినేని చాలా గట్టిగా ప్రయత్నించినా జగన్ పట్టించుకోలేదు. మీ సంగతి మాత్రం చూసుకోండి అన్నట్టుగా వ్యవహరించారు. తీరా పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది.

అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల విముఖంగానే ఉంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇన్నాళ్లూ వైసీపీలో తన అనుచరులుగా చెలామణీ అయిన వారినందరినీ అక్కడికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది.మరి ఆయన ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.  

Related Posts

Comments

spot_img

Recent Stories