ముస్లిములకు లేని దురద వైసీపీకి!

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని సామెత. ఆ సామెత ఇంకో రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయేలా ఉంది. తెలుగుదేశం- జనసేన కుదుర్చుకున్న పొత్తు బంధంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఏమాత్రం సహించలేకపోతున్నాయి. ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రధాని నరేంద్రమోడీ..చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడడాన్ని, ఆయన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తుండడాన్ని వైసీపీ ఏమాత్రం సహించలేకపోతోంది. అందుకే ఈ పొత్తు బంధం పట్ల ముస్లిముల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, తెలుగుదేశానికి, జనసేనకు ఒక్క ముస్లిం ఓటు కూడా పడదని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిజానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు, విధానాల పట్ల ముస్లిముల్లో కూడా పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ.. పనిగట్టుకుని.. ఇలాంటి విషప్రచారాన్ని కొనసాగించడానికి వైసీపీ దళాలు కుట్రపూరితంగా పనిచేస్తుండడం గమనార్హం.

సమాజంలో శాంతి భద్రతలు దిగజారేలా, మతాల మధ్య వైషమ్యాలు పెచ్చరిల్లేలా.. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా సాగుతున్న ప్రచారం గురించి.. శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడాచేశారు. మతాల మధ్య సమరసభావనను దెబ్బతీసేలా ఉన్న వారి ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు. వాలంటీర్ల ద్వారా జరుగుతున్న ప్రలోభాలను కూడా అడ్డుకోవాలని కోరారు.

మోడీతో పొత్తు పెట్టుకోగానే.. ముస్లిములందరూ కట్టగట్టుకుని తెలుగుదేశం, చంద్రబాబునాయుడు మీద దాడికి దిగుతారని వైసీపీ ఆశించింది. అయితే అలాంటిదేమీ కించిత్తు కూడా జరగనేలేదు. నిజానికి ప్రధాని మోడీ మీద కూడా ముస్లిం వర్గాల్లో , వ్యతిరేకులుప్రచారం చేసేంత ద్వేషం లేదు. త్రిపుల్ తలాక్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు.. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు రోడ్లమీదకు వచ్చి మరీ పండగ చేసుకున్నారు. కాశ్మీర్లో దేశీయ ముస్లింలకు కూడా సమానహక్కులు ఉండేలాగా.. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు దానిని వ్యతిరేకించిన వారు చాలా చాలా తక్కువ. సీఏఏ గురించి కూడా అవగాహన లేని రాద్ధాంతం కొంత జరిగిందే తప్ప.. అర్థం చేసుకున్న తర్వాత అందరూ సర్దుకున్నారు. అయోధ్య రామాలయం విషయంలో కోర్టు తీర్పును కూడా ఈ దేశంలోని ముస్లిం సమాజం తప్పు పట్టలేదు.

ఇన్ని పాజిటివ్ అంశాలుండగా.. మోడీతో పొత్తు పెట్టుకోవడం వలన.. తెలుగుదేశం ముస్లిం సమాజపు ఓటుబ్యాంకును కోల్పోతుందని వైసీపీ విషప్రచారం చేస్తోంది. అయితే.. వారి కుట్రలకు ముస్లిం సమాజం నుంచే ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. మోడీతో పొత్తు పెట్టుకోవడం కాదు.. రాష్ట్రాన్ని నిజమైన అభివృద్ధి పథంలో నడిపించే పాలన కావాలని కోరుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories