ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రజలందరూ ఈ పాటికి తాము ఎవరికి ఓటు వేయాలో.. ఎవరి పాలన వస్తే తమకు మంచి జరుగుతుందో.. ఎవరి పాలనలో ఎక్కువగా లబ్ధి పొందుతామో నిర్ణయించేసుకుని ఉంటారు. అయితే, ఏపీలో తమ ఓటమి తప్పదని తేల్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు.. తొలుత తాము ఊహించిన విధంగా ముస్లిం ఓటు బ్యాంకు కూడా ఫ్యానుకు అనుకూలంగా లేకపోయే సరికి విస్తుపోతున్నారు. ముస్లిం ఓట్లు చంద్రబాబునాయుడుకు, కూటమికి అనుకూలంగా పడకుండా చూడడానికి ఇప్పుడు వారు నానా పాట్లు పడుతున్నారు. అలాంటి వికట ప్రయత్నాల్లో భాగంగానే.. తెలంగాణకు మాత్రమే పరిమితమైన ముస్లిం నేత, మజ్లిస్ సారథి అసదుద్దీన్ ఒవైసీ ని సాక్షి ఇంటర్వ్యూ చేసి విస్తృతంగా ఏపీలో ప్రచారం చేస్తుండడం.
చంద్రబాబునాయుడు మోసగాడు అని, యూటర్న్ లో తీసుకుంటారని, ముస్లిం రిజర్వేషన్ పై కూడా అదేజరుగుతుందని అసదుద్దీన్ అంటున్నారు. జగన్ ఉంటేనే ముస్లింలకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామమాత్రపు అస్తిత్వం కూడా లేని మజ్లిస్ పార్టీ అధినేతను సాక్షి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసి.. చంద్రబాబు మీద బురద చల్లడానికి వాడుకోవడం వెనుక మర్మం ఏమిటో అందరూ ఊహించాదగిందే.
నిజానికి చంద్రబాబునాయుడు ,భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోగానే.. వైసీపీ పండగ చేసుకుంది. దీనివల్ల తెలుగుదేశానికి ఎంతో బలమైన ముస్లిం ఓటు బ్యాంకు పర్మినెంటుగా దూరం అవుతుందని భావించింది. అయిదేళ్ల పాలనలో తాము ముస్లిములకు ఏమీ చేయకపోయినప్పటికీ.. అప్రయత్నంగానే తమకు ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని వారు భావించారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తమ అంచనా తప్పు అని వారికి తెలిసి వచ్చింది. బిజెపితో పొత్తు ఉండవచ్చు గాక.. కానీ రాష్ట్రంలోని ముస్లిముల్లో ఎక్కడా కూడా చంద్రబాబు పట్ల వ్యతిరేకత బయటపడలేదు. పైపెచ్చు.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ముస్లింల ఓట్లు బిజెపికి పడే వాతావరణం కూడా వారి సర్వేల్లో బయటపడింది. దీంతో వారు ఖంగుతిన్నారు. ముస్లిం ఓటు బ్యాంకును చంద్రబాబుకు దూరం చేయాలని నానా పాట్లు పడుతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మజ్లిస్ అధినేత ఒవైసీని ఇంటర్వ్యూ చేయడం.
మజ్లిస్ కు గానీ, అసదుద్దీన్ ఒవైసీకి గానీ.. ముస్లిం పార్టీ అనే ముద్ర తప్ప.. వారు గెలిచే 7 అసెంబ్లీలలో తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా సమానంగా ముస్లిముల్లో ఆదరణ లేదు. వారు అడ్డగోలుగా మద్దతు ప్రకటించినప్పటికీ.. కేసీఆర్ పార్టీ తెలంగాణలో నెగ్గలేదు. ఇప్పుడు సాక్షి ఒవైసీని ఇంటర్వ్యూ చేసి.. ఆయనతో జగన్ అనుకూల మాటలు చెప్పిస్తోంది. ఇక్కడ ఏపీలో కూడా జగన్ ఓటమికే అది దారితీస్తుందని ప్రజలు అంటున్నారు.