విశాఖపట్నంలో జనసేన నాయకుడు మూర్తి యాదవ్- తమ నగర పరిధి లో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నా వాటి మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఎప్పటికప్పుడు ఆ బాగోతాలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. తప్పు జరిగిందని ఖరారుగా తెలిస్తే సాక్ష్యాధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి ఆ వ్యవహారాలను ఎండగట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా సరే తప్పును సరిదిద్దడానికి చూస్తుంటారు. అలాంటి జనసేన నాయకుడు మూర్తి యాదవ్ ఇప్పుడు విశాఖ నగర పరిధిలో టిడిఆర్ బాండ్ల ముసుగులో వందల కోట్ల రూపాయల అవినీతికి తెరతీస్తున్న వైసీపీ నాయకుల వ్యవహారం గురించి వివరాలు బయటపెడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో టిడిఆర్ ల పేరిట రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు బీభత్సమైన అవినీతికి అక్రమాలకు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుపతిలో కూడా ఇలాంటి అక్రమాలపై విచారణ జరుగుతూ ఉంది. వందల కోట్ల రూపాయల స్వాహాకు తెర తీశారు అని ఆరోపణలు వచ్చాయి. ఒక తిరుపతి మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక నగరాలలో టిడిఆర్ బాండ్ల ముసుగులో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. విశాఖపట్నానికి చెందిన మూర్తి యాదవ్ ఇప్పుడు తమ నగర పరిధిలోని అలాంటి అక్రమాల వ్యవహారం బయట పెడుతున్నారు.
ఆయన తాజా ఆరోపణల్లో కొత్త సంగతి ఏంటంటే అక్రమాలకు పాల్పడిన వైసిపి నాయకులు ప్రస్తుతం కూటమి నాయకులను ప్రలోభ పెట్టి కొత్త టిడిఆర్ బాండ్లు దక్కించుకోవడానికి, పెండింగ్లో పెట్టిన వాటికి కూడా లబ్ధి పొందడానికి కుట్రలు చేస్తున్నారని.. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
కేవలం ఈ బాండ్ల వ్యవహారం మాత్రమే కాదు. వైసిపి పరిపాలన కాలంలో లబ్ధి పొందిన అనేకమంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాయకులను ఆశ్రయించి తమ మిగిలిపోయిన పనులు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువగా వస్తున్నాయి. ప్రభుత్వం మారింది కానీ ప్రభుత్వం ద్వారా పనులు నెరవేరే అవకాశం ఇంకా వైసీపీ నాయకుల చేతుల్లో మాత్రమే ఉన్నదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మూర్తి యాదవ్ ఆరోపణలు కూడా అలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి పార్టీలలోని నాయకులు ఇతరుల ప్రలోభాలకు లొంగే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.