ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయితో జరిగిన దాడిని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఆయనకు నుదుటిమీద జరిగిన గాయం గురించి ఖచ్చితంగా సానుభూతి వ్యక్తంచేయాల్సిందే. నిందితులు ఎవ్వరైనా సరే వారికి శిక్ష పడి తీరాల్సిందే. కానీ జరిగిన దాడిని బట్టి విచక్షణతో దర్యాప్తు జరగాలి. అంతే తప్ప.. జగన్ గాయపడినదే తడవుగా.. దాన్ని ఎన్ని రకాలుగా వక్రీకరించవచ్చునో ఆలోచిస్తూ సాగడం అనేది ఘోరంగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా.. ఈ రాయిని చంద్రబాబునాయుడే వేయించినట్లుగా చెప్పడానికి, రాజకీయాల్లో అనైతికమైన దాడిగా అభివర్ణించడానికి నానా పాట్లు పడుతున్నారు. ఈలోగా ఇది ఏకంగా హత్యాయత్నం అని అభివర్ణిస్తూ కేశినేని నాని వంటి నాయకులు, మరియు సాక్షి ఛానెల్ ఒక ప్రచారాన్ని ప్రారంభించేశాయి.
సాక్షి ఛానెల్లో ఈ దాడి గురించి ప్రతి మాటకు ముందు వెనుక హత్యాయత్నం అనే పదంతోనే వ్యవహరిస్తున్నారు. చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ తో చేయించినట్టుగా చెబుతున్నారు. షార్ప్ షూటర్లయిన స్నైపర్ లను వాడారు అని మాత్రమే అనడం లేదు. ఎయిర్ గన్ వంటి తుపాకీలోంచి రాయితో కొట్టారేమో అనే సందేహాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.
జగన్ కు నుదుటిమీద గాయమైంది. ఆ గాయం Y ఆకారంలో ఉండడం వలన అది గుండ్రటి రాయి కారణంగా తగిలిన గాయం కాదని, ఫైర్ స్టోన్ వంటిదని, గులకరాయి వంటిదని అంటున్నారు. గుండ్రటి రాయి అయితే ఎయిర్ గన్ లోంచి కూడా వచ్చి ఉండొచ్చు గానీ.. అలాంటిది కాకపోవడం వలన క్యాట్ బాల్ తో వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తుండగా.. సంఘటన స్థలం నుంచి వివరాలు తెలియజెప్పే ప్రయత్నం చేసిన విలేకరి మాత్రం ‘‘షార్ప్ షూటర్’’ తప్ప మరెవ్వరూ ఈ పని చేయలేరంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం విశేషం.
తలమీద గులకరాయి కారణంగా చిన్న దెబ్బ తగిలితే దానిని హత్యాయత్నంగా అభివర్ణించడం చూస్తోంటే.. అచ్చంగా అయిదేళ్ల కిందటి కోడికత్తి డ్రామానే ప్రజలకు గుర్తుకు వస్తోంది. జగన్ ను చంపడానికి ఓ కుర్రాడు కోడికత్తిని తీసుకువచ్చాడుట.. దానితో ఆయన భుజం మీద పొడిచాడుట… ఆ సంఘటన నుంచి వైసీపీ ఎంత మైలేజీ పొందినదో అందరికీ తెలుసు. అదే తరహాలో.. ఈ ‘గులకరాయి’ నుంచి కూడా ‘హత్యాయత్నం’ మైలేజీ కోసం ఆరాటపడుతున్నది సాక్షి. ఆ గులకరాయి చాలా పదునుగా ఉన్నదని, అది ఇంకాస్త గట్టిగా తగిలిఉంటే.. నుదురుకింద పుర్రెకూడా పగిలి ప్రాణాపాయం సంభవించి ఉండేదని, కణతకు తగిలిఉన్నా కూడా ప్రాణాపాయం జరిగేదని ఇలా రకరకాలుగా.. హత్య జరగబోయింది అనే భ్రమను ప్రజలకు కల్పించడానికి సాక్షి టీవీ శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తోంది.