శపథం చేసి ఓడిపోయినందుకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఉడికిపోతున్నట్టుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కాస్త హైప్ క్రియేట్ చేయడం కోసం విసిరిన సవాలుకు విలువ ఇచ్చి ఆయన తన పేరు వెనుక ‘రెడ్డి’ అని తగిలించుకోవడాన్ని కాపు నాయకులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఆవేశంలో ఆ పని చేశారుగానీ ముద్రగడ పద్మనాభం కూడా మారిపోయిన పేరు పట్ల అసహనంగానే ఉన్నట్టు తెలుస్తోంది. పాపం ఆయన పరిస్థితి- మొగుడు కొట్టినందుకు కాదు గానీ.. తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిన ఇల్లాలి చందంగా ఉంది. తాను రెడ్డిగా మారిపోయినందుకు కాదుగానీ.. అందుకు కాపు అభిమానులు తిడుతున్నందుకు ఆయన విలపిస్తున్నారు.
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్ ను అసహ్యించుకుంటున్నారనే వాస్తవాన్ని గుర్తించడంలో విఫలమై- రాజకీయ నిర్ణయాలు తీసుకున్నందుకు ముద్రగడ పద్మనాభం పశ్చాత్తాప పడుతున్నారట! భవిష్యత్తు రాజకీయం అంధకారంగా కనిపిస్తున్న వేళ ఆయన అర్థంపర్థం లేకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తున్నారు !
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతానని లేకపోతే తన పేరు చివరి రెడ్డి అని పెట్టుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో గట్టి శపధం చేశారు. పవన్ బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. ముద్రగడ కూడా తన శపథానికి కట్టుబడి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డి గా మారిపోవడం జరిగింది. అప్పటినుంచి ఆయనను బండబూతులు తిడుతూ అనేక మెసేజీలు వస్తున్నాయట. అవి ఆయనకు కంటగింపుగా మారినట్లు ఉంది. అయితే ఆ మెసేజ్లు అన్ని పవన్ కళ్యాణ్ అభిమానులే పంపుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
తనను బండ బూతులు తిడుతూ పవన అభిమానులు మెసేజ్లు పెడుతున్నారని ఇలా వేధించే బదులుగా తమ కుటుంబ సభ్యులు ఏడుగురినీ ఒకేసారి చంపేస్తే పోతుందని ముద్రగడ పద్మనాభం తనకు సహజమైన ఓవరాక్షన్ డైలాగులు వల్లిస్తున్నారు. చచ్చిన పాము లాంటి ముద్రగడను, కాపు నాయకుడిగా అస్తిత్వాన్ని కూడా కోల్పోయిన ముద్రగడను చంపవలసిన అవసరం- దారిన పోయే దానయ్యకు కూడా ఉండదనే వాస్తవాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. రెడ్డిగా మారిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ను బదనాం చేయడం ఒక్కటే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఆయనను తిడుతున్న మెసేజీలు పవన అభిమానులే పంపుతున్నారని ఏంటి గ్యారెంటీ? నీలాంటి వాడు రెడ్డి అని తగిలించుకోవడం మాకు అవమానం అనే భావనతో జగన్ రెడ్డి అభిమానులు కూడా పంపుతూ ఉండవచ్చు కదా? కాపు నాయకుడుగా చెలామణీ అవుతూ సిగ్గు విడిచి రెడ్డి అని తగిలించుకుంటావా అని ఆయన సొంత అభిమానులే తిడుతుండవచ్చు కదా.. అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.