కింద పడ్డా పైచేయి నాదే అనే సిద్ధాంతకారులు మనకు రాజకీయాల్లో పుష్కలంగా కనిపిస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా.. నైతిక విజయం తమదే అని చెప్పుకునే అనేకమంది ఈ బాపతు వాళ్లే. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రస్తుతానికి ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం ఉండగల పొజిషన్ లో లేరుగానీ.. అలాంటి వైఖరినే చూపిస్తున్నారు. విషయం ఏంటంటే.. గురువారం నాడు వైఎస్సార్ సీపీ లో చేరడానికి తొలుత ముహూర్తం నిర్ణయించుకున్న ముద్రగడ తర్వాత దానిని రద్దు చేసుకున్నారు. తాజా ప్రకటనలో 15, 16 తేదీల్లో ఏదో ఒకరోజు తానొక్కడినే వెళ్లి వైసీపీలో చేరుతానని ప్రకటించారు.
ఆయన చేరిక గురించి ముహూర్తాలను ఆయన ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఆయన ఇష్టం. కానీ, గురువారం ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నందుకు చెప్పిన కారణమే తమాషా. వెయ్యి కార్లతో ర్యాలీగా వెళ్లి తాడేపల్లిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని అనుకుని ఆయన పిలుపు ఇచ్చారట. ఆ పిలుపు చూసి అనూహ్యమైన స్పందన వచ్చిందట. అంటే బహుశా వెయ్యి కార్లకు ఆయన పిలుపు ఇస్తే అయిదారు వేల కార్లతో ర్యాలీ తీసేందుకు అందరూ స్పందించారో ఏమో మరి! అన్ని వేల మందిని తాడేపల్లికి తీసుకువెళ్లడం భద్రత రీత్యా ఇబ్బంది అవుతుందని భావించి ఆయన వాయిదా వేసుకున్నారట. ఒక్కడే వెళ్లి జగన్ పార్టీలో చేరిపోతారట.
ర్యాలీ రద్దు విషయాన్ని కవర్ చేసుకోవడానికి పాపం ముద్రగడ చాలా కష్టపడుతున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. సొంతంగా భోజనాలు తెచ్చుకోమని చెప్పిన వెయ్యికార్ల ర్యాలీ పిలుపు గురించి ఉభయగోదావరి జిల్లాల కాపుల్లో పట్టించుకున్న వారు లేరు. అంత లావు పిలుపు ఇచ్చి పేలవంగా ర్యాలీ నిర్వహిస్తే పరువు పోతుందని ఆయన భయపడ్డారు. అందుకే ముందు జాగ్రత్తగా.. అనూహ్యస్పందన, భద్రతకు ఇబ్బందులు అనే ముసుగులో ఏకంగా ఆ ఆలోచన రద్దు చేసుకున్నారు.
ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి? ఎన్నికల్లో జగన్ మళ్లీ నెగ్గితే తనకు రాజ్యసభ ఎంపీ లాంటి పెద్ద పదవి ఇస్తారేమో అని ఆయన ఆశిస్తున్నారు. అందుకు తగినంత కులబలం తనకున్నదని చాటుకోవడానికి ర్యాలీ పాచిక వేశారు. అది బెడిసి కొట్టింది. ర్యాలీ ఎందుకు రద్దయిందో ఆయన ఏ కారణాలు చెప్పినా.. జగన్ తన వేగుల ద్వారా తెలుసుకోకుండా ఉంటారా? మరి ముద్రగడ పార్టీలో చేరినంత మాత్రాన కులబలం సన్నగిల్లిన ఆయనకు ఎలాంటి పదవి కట్టబెట్టబోతారు? అనేవి ఇప్పుడు చర్చనీయాంశాలుగా ఉన్నాయి.