వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరాచకాలకు, అక్రమాలకు పాల్పడిన వారు.. ఇప్పుడు పోలీసు కేసుల బారిన పడి విచారణను ఎదుర్కొంటున్న సందర్భాల్లో ‘నాకు తెలియదు.. గుర్తులేదు.. సంబధం లేదు..’ అనే సమాధానాలు చెప్పడం ప్రజలకు కూడా బాగా అలవాటు అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవడానికి ఇలాంటి సమాధానాలు రక్షగా నిలుస్తాయనే సలహాలు చెప్పగల మాస్టర్ బ్రెయిన్ వ్యక్తి.. స్వయంగా తానే విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. భిన్నంగా ఎలా చెబుతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు.. సీఐడీ పోలీసుల విచారణలో ఇవే సమాధానాలు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆశ్చర్యపోరు. కానీ పీఎస్సార్ ఆంజనేయులు చెప్పిన ఇతర మాటలను కూడా గమనిస్తే ఆయన మాస్టర్ బ్రెయిన్ మాత్రమే కాదు.. మిస్టర్ కూల్ కూడా అని తప్పకుండా అనిపిస్తుంది.
అరెస్టు చేయడానికి మీరు వస్తారని నాకు వారం ముందే తెలుసు. అరెస్టు చేస్తే ఒకసారి లోపలకు వెళ్లి వద్దాం అనుకున్నా.. అందుకే ముందస్తు బెయిలు కోసం కూడా పిటిషన్ వేయలేదు.. అని ఆంజనేయులు సీఐడీ వారితో చెప్పడం చూసి వారే నిర్ఘాంతపోయారు. సీఐడీ అధికారులు ఏం అడిగినా సరే ఎలాంటి కంగారు లేకుండా చాలా నింపాదిగా ఆంజనేయులు సమాధానాలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఆయన అరెస్టుకు కారణం అయిన కాదంబరి జెత్వానీ గురించి ప్రస్తావించినప్పుడు.. ‘జెత్వానీ ఎవరో నాకు తెలియదు. నాకు అప్పట్లో ఈ విషయాలు పట్టించుకునే తీరిక లేదు. ఆమె గురించి ఈ మధ్యే తెలుసుకున్నా.. సదభిప్రాయం కలగలేదు. విద్యాసాగర్ తో సహజీవనం సాగించినట్టు తెలిసింది’ అని చెప్పినట్టు సమాచారం.
ప్రాప్తం ఉంటే అన్నీ వస్తాయి- అంటూ తన అరెస్టు, రిమాండులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి గురించి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అదే రిమాండు నిమిత్తం కోర్టు ఎదుట ప్రవేశపెట్టినప్పుడు.. తన తరఫున తానే వాదనలు వినిపించుకున్న ఆంజనేయులు.. ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని చెప్పడం గమనార్హం. విశాల్ గున్నీని ప్రొటెక్టు చేస్తాం అని ప్రభుత్వం హామీ ఇచ్చి.. ఆయనతో తమకు కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇప్పించుకున్నారని ఆయన కోర్టు ఎదుట ఆరోపించినట్టుగా తెలుస్తోంది. కాదంబరి జత్వానీ కేసులో విశాల్ గున్నీ వాంగ్మూలమే కీలకంగా ఉంది. దాని ఆధారంగానే పీఎస్సార్ ఆంజనేయులు పాత్ర కూడా తేలింది. ఆయన అరెస్టు అయ్యారు. అసలు ఆ వాంగ్మూలమే కుట్రపూరితం అని చెప్పడం ద్వారా తనను తాను కాపాడుకోవచ్చునని ఆంజనేయులు భావిస్తున్నట్టుగా ఉంది.