సూపర్ సిక్స్ హామీల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడపడుచులకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన హామీలలో కీలకమైన ఒక హామీ అది త్వరలోనే సాకారం కాబోతున్నది. మహిళా జగతి సాధికారతను సాధించి సమాజం సుసంపన్నం కావడానికి వీలుగా చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం పథకాన్ని ఇరుగుపొరుగు రాష్ట్రాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక సమగ్ర విధానం తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ‘అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ముఖ్యమంత్రి చేస్తారు’ అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది చాలా గొప్ప సంక్షేమ పథకం అని అనుకోవాలి- ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే మహిళ లు అనేకమంది ఇతరుల మీద ఆధారపడుతుంటారు. తమకు కొద్ది దూరంలో పట్టణాలు అక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలను దొరకపుచ్చుకోగలిగే వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా మంది వెళ్లకుండా కేవలం రవాణా ఖర్చులు భరించలేక అలాంటి చిరుద్యోగాలను వదులుకుంటూ ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళలు కొంత దూరంలో ఉండే ప్రాంతాలకు వెళ్లి తాము చేసే కష్టానికి సరైన ధనం కూలీగా పొందే అవకాశం ఉంటుంది. దీని వలన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళా సాధికారత ఏర్పడుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు పంచిపెట్టడం మాత్రం కాకుండా తమ జీవితాలలో నిలదొక్కు కొనేలాగా చేయడానికి పథకం ఉపయోగపడుతుంది.
అలాగే ఉచిత బస్సు ప్రయాణం అనేది దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు సర్కారు కేవలం మహిళలకు తమ ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఉచితమే గనుక ఊర్లు తిరగడం అంటూ ఈ పద్ధతిలో జరగదు.
ఇప్పటికే ఇరుగుపొరుగు రాష్ట్రాలలో అధికారులు అధ్యయనం కసరత్తు పూర్తి చేశారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి చెబుతున్నారు. దానిని ఎప్పటి నుంచి అమలులో పెట్టేది 12వ తేదీ ఇస్తారని మంత్రి ప్రకటించారు. మొత్తానికి సూపర్ సిక్స్ లో మహిళలకు ప్రకటించిన వరాలు ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువస్తున్నారు.