మంచు మోహన్ బాబు చాలా మెట్లు దిగివచ్చారు. తాను కొట్టడంతో గాయపడి, ప్రెవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక చానెల్ విలేకరిని ఆయన వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. విలేకరి తరఫు నుంచి మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. పోలీసులు ఆయనకోసం వెతుకుతున్నట్టుగా ఒక రోజంతా పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తన పెద్దకొడుకు విష్ణును వెంటబెట్టుకుని ఆస్పత్రికి వెళ్లారు. ఆయన క్షమాపణలతో అంతా సెట్ అయినట్టే కనిపిస్తోంది. సదరు టీవీచానెల్ కూడా హత్యాయత్నం కేసు ను వెనక్కు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
గాయపడిన విలేకరి రంజిత్ ను పరామర్శించడానికి మోహన్ బాబు ఆస్పత్రికి వెళ్లారు. తాను ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని, తన ద్వారా తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. టీవీ చానెల్ కు కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. విలేకరి కుటుంబాన్ని కూడా పలకరించి వారికి అనునయవచనాలు చెప్పారు.
మోహన్ బాబు క్షమాపణలు చెప్పడంతో ప్రస్తుతానికి అంతా సద్దుమణిగినట్టుగానే కనిపిస్తోంది. రెండు రోజుల కిందట బిజెపి గోషామహల్ స్టేడియం ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా విలేకరిపై దాడి కేసు విషయంలో స్పందించి మోహన్ బాబుకు ఒక సలహా ఇచ్చారు.
ఆయన స్వచ్ఛందంగా విలేకరికి క్షమాపణ చెప్పడం అవసరం అని.. లేకపోతే ఈ వివాదం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉన్నదని ఆయన హితవు చెప్పారు. మరొకవైపు జర్నలిస్టు సంఘాలన్నీ.. విచ్చలవిడిగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా నిరసనలు, దూషణలు ప్రారంభించాయి.
ఘర్షణ జరిగిన రోజున తాను కూడా గాయపడిన మోహన్ బాబు.. అదే రోజున ఆస్పత్రిలో చేరి రెండు రోజులు ఉన్నారు. డిశ్చార్జి అయిన వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేయలేదని మీడియా కొంత అత్యుత్సాహం చూపించింది. జరిగిన ఘటన ఆవేశంలో స్పందించడం మాత్రమే తప్ప హత్యాయత్నం కాదనే సంగతి అందరికీ తెలుసు. కానీ.. టీవీ చానెల్ ఆయన మీద హత్యాయత్నం కేసుకు గట్టిగానే పట్టుబట్టింది.
డిశ్చార్జి అయిన మోహన్ బాబు పరారైపోయారంటూ.. కథనాలు వండి వర్చారు. మొత్తానికి ఆయన ఒక మెట్టు దిగి వచ్చారు. తన వలన ఇబ్బంది పడిన విలేకరిని పరామర్శించారు. క్షమాపణలతో ఆయన పాపం మొత్తం దాదాపుగా ప్రక్షాళన అయినట్టే. ఇదే టీవీ ఛానెల్ కాస్త మెత్తబడింది. ఆయన మీద కేసు ఉపసంహరించుకుంటారని కూడా అర్థమవుతోంది.