ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుంచి కేంద్రంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే విషయంలో ప్రజలు అంచనాలు కొంతమేరకు తప్పాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీల్లో తెలుగుమోపో అంచనా వేసినట్టుగానే.. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు పదవులు దక్కాయి. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి బెర్త్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ అది తేడా కొట్టింది. చిన్నమ్మను పక్కన పెట్టి.. నరసాపురం నుంచి ఎంపీగా మొదటిసారి గెలిచిన శ్రీనివాసవర్మను మంత్రిపదవికి ఎంపిక చేశారు మోడీ. ఇలా చేయడం వెనుక రాష్ట్రంలో ఎన్డీయేను మరింతగా బలోపేతం చేసే పటిష్టమైన వ్యూహం దాగిఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
అసలు మర్మం ఏంటంటే.. దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. సమర్థురాలైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కూడా. కానీ ఆమెకు అవకాశం దక్కలేదు. ఇందుకు కులసమీకరణాలే కారణం అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మాత్రమే కేంద్రమంత్రులు అవుతున్నారు. తెలంగాణకు రెండు, ఏపీకి మూడు బెర్తులు దక్కాయి. తెలుగుదేశం కోటా రెండింటిలో బీసీ రామ్మోహన్ నాయుడు, కమ్మ వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. భాజపా కోటాలో మళ్లీ కమ్మ వర్గానికే చెందిన పురందేశ్వరికి ఇస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందని మోడీ అంచనావేసినట్లుగా ఉంది.
దానితో పాటు… ఏపీలో తెలుగుదేశంతో పొత్తుల్లో ఉన్న కారణం చేత.. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం పూర్తిగా కూటమికి దన్నుగానే ఉంటుంది. భాజపాకు అనుకూల ఓటుబ్యాంకుగానే ఉంటుంది. అలాంటి నేపథ్యంలో మరొక సామాజిక వర్గం మీద ఫోకస్ పెట్టడం రైట్ స్ట్రాటజీ అవుతుందని వారు నమ్మారు. అందుకే క్షత్రియ సామాజిక వర్గం నుంచి శ్రీనివాసవర్మను ఎంపిక చేశారు. పైగా శ్రీనివాసవర్మ కొన్ని దశాబ్దాలుగా భాజపాకు సుశిక్షితుడైన కార్యకర్త. ఆరెస్సెస్, యువమోర్చాల్లో పనిచేశారు. ఆయనకు ఈ ఉన్నత పదవి ఇవ్వడం ద్వారా.. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఏదో ఒక నాటికి వైభవం దక్కుతుందని పార్టీకి సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా ఉంటుందని వారు భావించారు. మొత్తానికి పురందేశ్వరికి ప్రస్తుతానికి చాన్స్ లేకుండా పోయిందని పలువురు మాట్లాడుకుంటున్నారు.