మోడీ క్లారిటీ.. ఇంకా ఆ మాటంటే, రాహుల్ కే డేమేజీ!

ప్రతిపక్షాలు కోరుకున్నట్టుగా పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ప్రతిపక్షాలు ఆశించినది వేరు.. కానీ పార్లమెంటులో జరిగినది వేరు! ఆపరేషన్ సింధూర్ మీద చర్చ అనగానే భాజపా బెదిరిపోతుందని, తాము చేయబోయే చర్చకు వణుకుతుందని రాహుల్ గాంధీ అనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ప్రధాని నరేంద్రమోడీ.. పాకిస్తాన్  మీద దాడుల సమయంలో ఎంత గుంభనంగా, దృఢంగా, ధీరోదాత్తంగా వ్యవహరించారో పార్లమెంటులో ప్రసంగం సందర్భంగా కూడా అదే మాదిరిగా వ్యవహరించారు. తాను తొలినుంచి ఏ మాట చెబుతున్నారో అదే మాటకు పార్లమెంటులో కూడా కట్టుబడి ఉన్నారు. కానీ.. ఆపరేషన్ సింధూర్ అనే అంశాన్ని పట్టుకుని.. భాజపాను బద్నాం చేయగలం అని అనుకుంటే.. అందుకోసం మాటలు మారుస్తూ ఎప్పటికప్పుడు కొత్త విమర్శలను నిందలను తయారుచేసుకుంటూ వెళ్లాలనుకుంటూ తన పరువే పోతుందని రాహుల్ గాంధీ గుర్తించాల్సిన అవసరం ఉంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో వాచాలత్వం కొద్దీ.. భారత్ పాక్ మధ్య యుద్ధం తన మాట వల్లనే ఆగిపోయిందని అన్నాడే అనుకుందాం. ఆ విషయాన్ని ఆయన వివిధ అంతర్జాతీయ వేదికల మీద మళ్లీ మళ్లీ కూడా చెప్పాడే అనుకుందాం. ఆ మాట మీద దేశంలో ప్రధానప్రతిపక్షానికి నాయకుడిగా .. ప్రభుత్వం నుంచి వివరణ కోరే హక్కు రాహుల్ గాంధీకి ఉంది. కానీ.. భారత్ తరఫున విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్రమోడీ అందరూ కూడా వేర్వేరు సందర్భాల్లో.. పాక్ మీద దాడులు ఆపేయడానికి ట్రంప్ కు సంబంధం లేనేలేదని తేల్చి చెప్పారు. అయినా సరే.. రాహుల్ తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అన్నట్టుగా ట్రంప్ పాతిక సార్లు చెప్పాడు కదా.. అంటూ వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.

నరేంద్రమోడీ పార్లమెంటు సాక్షిగా కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ ను ఆపాలని ఏ దేశనేతా అడగలేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రత్యేకంగా ట్రంప్ ఒక్కడి పేరును మాత్రమే ప్రస్తావించడం కూడా ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో రాహుల్ మాత్రం.. భారత్ లొంగిపోయినట్టుగా రాజ్ నాధ్ చెప్పిన టైంలైన్ లోని మాటలను పట్టుకుని, భారత్ పాక్ ఎదుట సాగిలపడినట్టుగా రంగుపులిమి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం రాజకీయ చవకబారుతనంగా ప్రజలు గుర్తిస్తున్నారు.
మోడీ సర్కారును నిందలపాల్జేసి దేశంలో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అందుకు అనేక మార్గాలు ఉంటాయి. కేంద్ర విధానాలను అనేకం విమర్శించవచ్చు.. అందులో లోటుపాట్లను ప్రస్తావించవచ్చు. అంతే తప్ప.. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ కు చేతకాలేదన్నట్టుగా, భారత్ పాక్ ఎదుట లొంగిపోయిందన్నట్టుగా ప్రచారం చేసి లాభపడాలని అనుకోవడం రాహుల్ కు తగదు. ఆయన అన్నింటికంటె ముందు ఆపరేషన్ సింధూర్ అనేది యుద్ధం కాదు.. దాడులు మాత్రమే అనే సంగతి గుర్తించాలి. అలా గుర్తిస్తే తాను చేసే విషప్రచారం సాగదని రాహుల్ భయపడుతున్నారు. అందుకే మాటిమాటికీ యుద్ధం అనే పదం వాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పహల్గాం దాడులకు బదులుగా చేసిన ప్రతీకారదాడి మాత్రమే అనేది గ్రహించకుంటే రాహుల్ కే రాజకీయ నష్టం వాటిల్లుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories