ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం ఎంతో వేడుకగా, శుభప్రదంగా జరిగింది. భారతదేశానికి గర్వకారణంగా నిలవగల నగరపు పునర్నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తశుద్ధిని, సంకల్ప దీక్షని, కార్యసమర్థతను ప్రధాని నరేంద్రమోడీ వేనోళ్ల కొనియాడారు. రాష్ట్రంలోని తెలుగుదేశం శ్రేణులకు, చంద్రబాబు మీద విశ్వాసంతోనే నాలుగోసారి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు కూడా ఎంతో ఉత్సాహం కలిగించేలాగా, వారిలోని నమ్మకాన్ని ఇనుమడింపజేసేలాగా ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబునాయుడు గురించి చెప్పడం విశేషం.
‘టెక్నాలజీ నాతో మొదలైనట్టుగా చంద్రబాబు కొనియాడారు. కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రిని అయిన తర్వాత.. హైదరాబాదులో ఐటీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. ప్రత్యేకంగా అధికార్లను పంపి.. హైదరాబాదు ఐటీ రంగ అభివృద్ధి గురించి అధ్యయనం చేయించానని ఆయన గుర్తు చేసుకున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా వాటిని పూర్తిచేయాలన్నా చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అని కూడా నరేంద్రమోడీ కితాబిచ్చారు. పెద్ద పనుల్ని పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలోనే లేడని నరేంద్రమోడీ సర్టిఫై చేయడం విశేషం.
అమరావతి రాజధాని నిర్మాణం అనేది .. ఈ దేశంలోనే ఇప్పటిదాకా జరుగుతున్న ఇటువంటి అతిపెద్ద ప్రయత్నం అని మనం గుర్తించాలి. ఏకంగా 54 వేల ఎకరాల్లో విస్తరించిన ప్రాంతంలో.. పూర్తిగా ఖాళీగా ఉన్న భూమిమీద ఒక నగరాన్ని నిర్మించడానికి జరుగుతున్న కృషి అనిర్వచనీయమైనది. ఇవాళ పునర్నిర్మాణ పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం కాగా.. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే కీలక నిర్మాణాలు అన్నింటినీ పూర్తిచేయాలనే స్థిర సంకల్పంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కొద్దిగా పనులు అటుఇటు అయినా కూడా.. నాలుగేళ్లలో నగర నిర్మాణం పూర్తయినా కూడా అది అద్భుతమే అవుతుంది. ఇక్కడితో ఆగడం లేదు.
అమరావతి నగరాన్ని మరింత అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో.. మరో 55 వేల ఎకరాల సమీకరణకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ స్వప్నాలను గమనించినప్పుడు.. పెద్దపెద్ద ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయగల సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని సాక్షాత్తూ ప్రధాని కితాబులివ్వడం అందరికీ ఉత్సాహాన్ని కలిగించే అంశం.
కేవలం అమరావతి మాత్రమే కాకుండా.. అటు పోలవరం, విశాఖలో ఐటీ రాజధాని అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా.. చంద్రబాబు ఈ ప్రభుత్వ కాలంలోనే పూర్తిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతారని అంతా అనుకుంటున్నారు.